● బోధన్ ఆర్డీవో కార్యాలయం
ఎదుట బాధితురాలి ధర్నా
బోధన్‌టౌన్(బోధన్): ప్రేమ పేరు చెప్పి సహజీవనం చేసి, మోసం చేశాడని, నాకు న్యాయం చేయండని బాధిత మహిళ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బోధన్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. పోతంగల్ మండలంలోని జల్లాపల్లి గ్రామ సర్పంచ్ దస్తగిరి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లు సహజీవనం చేశాడన్నారు. వివాహం చేసుకుంటానని పలుమార్లు వాయిదా వేయడంతోపాటు, తను వేరే వారిని పెళ్లి చేసుకుంటే విడాకులు ఇప్పించాడన్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకుందామని నమ్మించి బోధన్‌లో అద్దె ఇంట్లో ఉంచి నాలుగేళ్లు సహజీవనం చేశాడన్నారు. తనకు రెండు సార్లు అబార్షన్ చేయించాడని పేర్కొంది. సర్పంచ్‌తోపాటు అబార్షన్ చేసిన ఆర్‌ఎంపీ ఇలియాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. విషయం తెలిసిన సర్పంచ్, ఆర్‌ఎంపీ డాక్టర్ ఇద్దరు పారిపోయారని, సర్పంచ్ కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.


