క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

పేకాడుతున్న ఏడుగురి అరెస్టు

ట్రాక్టర్‌ బోల్తాపడి యువకుడి మృతి

బీబీపేట: ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా అదుపు తప్పి బోల్తాపడి యువకుడు మృతి చెందిన ఘటన మాందాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్‌చంద్ర తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రాజెల్లిపేట శ్రీధర్‌ (26) అనే వ్యక్తి సోమవారం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో భూమి దున్నడానికి వెళ్లాడు. ఈక్రమంలో ట్రాక్టర్‌ పొలంలో బోల్తా పడగా, శ్రీధర్‌ కిందపడి బురదలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు..

డిచ్‌పల్లి: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన గణపురం గౌతమ్‌ (26)కు జనవరిలో వివాహం జరుగగా, ఇటీవల దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన గౌతమ్‌ క్షణికావేశంలో వారం రోజుల క్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మొక్కలు నాటుతూ జారిపడి కూలీ ..

నిజాంసాగర్‌ (జుక్కల్‌): మండలంలోని మాగి గ్రామ శివారులో ఓ ఉపాధి కూలీ మొక్కలు నాటుతుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతిచెందాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మామిళ్ల భద్రయ్య (64) అనే ఉపాధి కూలీ సోమవారం ముత్యపువాని కుంట వద్ద గుంతలు తవ్వి మొక్కలు నాటే పనులకు వెళ్లాడు. ఈక్రమంలో అతడు కూలీలతో కలిసి గుంతలు తవ్వి, మొక్కలు నాటుతున్న క్రమంలో అస్వస్థతకు గురై, కాలు జారి కింద పడి మృతి చెందినట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బాలరాజ్‌ తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని న్యాల్‌కల్‌ రోడ్డులోని విజ్ఞారాజ్‌ అపార్టమెంట్‌లోగల పేకాట స్థావరంపై దాడిచేసినట్లు 5వ టౌన్‌ ఎస్సై సునీల్‌ సోమవారం తెలిపారు. ఈ దాడిలో పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.1930 నగదు, 4ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement