అడ్మిషన్లు క్లోజ్‌..! | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లు క్లోజ్‌..!

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

మోపాల్‌: ‘అడ్మిషన్లు క్లోజ్‌’ అంటే అదేదో పేరున్న ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాల అనుకుంటారు. అయితే ఈ బోర్డు ఏర్పాటు చేసింది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో..! నిజామాబాద్‌ నగర శివారులోని బోర్గాం (పి) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్ల కోసం ఇప్పటికే 400 వరకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 200 పైగా ప్రయివేటు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులవే. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో గత విద్యాసంవత్సరం 1005 మంది విద్యనభ్యసించారు. అందులో 223 మంది పదోతరగతి పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. వెళ్లిపోయిన 223 మందితోపాటు ప్రభుత్వం నిర్దేశించిన 10 శాతం అడ్మిషన్లు పెంచాలనే లక్ష్యంతో మరో వందమందికి అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఈ పాఠశాలలో అడ్మిషన్‌ కోసం మార్చి నుంచే దరఖాస్తులు చేసుకుంటున్నారు. అడ్మిషన్లు క్లోజ్‌ అని బోర్డు పెట్టే పరిస్థితి ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో ఏర్పడుతోంది. ఈసారి విద్యార్థుల సంఖ్య 1150కి మించిపోనుంది.

22 సెక్షన్లు.. 40 మంది ఉపాధ్యాయులు..

పాఠశాల 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలోనే కొనసాగుతోంది.

మొత్తం 22 సెక్షన్లు ఉండగా, 40 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో గదుల కొర త నెలకొంది.

అందుకే అడ్మిషన్లు తీసుకునేందుకు కొన్ని నిబంధనలు పెట్టనున్నట్లు తెలిసింది.

ఎందుకంత క్రేజీ..?

బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు రాష్ట్రంలోనే మంచి పేరుంది. ఈ పాఠశాలలో హెచ్‌ఎంలతోపాటు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా, కమిట్‌మెంట్‌తో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈపాఠశాలకు చెందిన హెచ్‌ఎంలు 2006లో గడ్డం గంగారెడ్డి, 2012లో పండరి సత్యనారాయణరావు, 2018లో నర్ర రామారావుకు జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు రాత్రికిరాత్రే అంత క్రేజీ రాలేదు.. చాలా ఏళ్లుగా, ఎంతోమంది హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కష్టపడటం వల్లే ఈస్థాయికి వచ్చింది.

ఏర్పాట్లు పూర్తి..

పాఠశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు సిద్ధం చేశాం. తరగతి గదులు శుభ్రం చేయడంతోపాటు విద్యుత్‌ సరఫరా, ఇతరత్ర మరమ్మతులు చేపట్టాం. విద్యార్థులకు ప్రతిరోజూ తరగతుల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం.

– శంకర్‌, హెచ్‌ఎం, బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌

ప్రత్యేకతలు..

విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైతిక విలువలు, క్రమశిక్షణ నేర్పుతారు.

విద్యార్థులకు విద్యతోపాటు ప్రతిరోజూ క్రీడలు ఆడిస్తారు.

వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, క్లబ్‌ల సహకారంతో సమాజంపై అవగాహన, శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించడం, ఇతరత్ర కార్యక్రమాల నిర్వహణ

ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌

ప్రతియేటా ట్రిపుల్‌ ఐటీలకు ఎంపిక

మెనూ ప్రకారం ఎండీఎం, ఆర్‌ఓ ప్లాంట్‌ ద్వారా తాగునీటి సరఫరా

మూత్రశాలలు, మరుగుదొడ్ల శుభ్రత

ముఖ్యంగా 9, 10 తరగతుల విద్యార్థులకు బ్యూటీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌ ఒకేషనల్‌ కోర్సుల నిర్వహణ

6 ఇంటరాక్టీవ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ) ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన

ఈ విద్యాసంవత్సరానికి

400 దరఖాస్తులు

200 పైగా ప్రయివేటు

పాఠశాలల విద్యార్థులవే !

బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌కు

రాష్ట్రంలోనే మంచి గుర్తింపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement