జింకలు విలవిల | - | Sakshi
Sakshi News home page

జింకలు విలవిల

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

గోదారి తీరాన

గాయపడిన జింకకు సపర్యలు చేస్తున్న రైతు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఒకప్పుడు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో జింకలు గుంపులు గుంపులుగా తిరిగేవి. కుక్కల దాడి కారణంగా ఇప్పుడు పట్టుమని పది జింకలు కూడా కనిపించడం లేదు. ఇవి కూడా కనుమరుగైతే అప్పుడు ఏకో టూరిజం ఏర్పాటు చేసినా ఎలాంటి అర్థం ఉండదు. వచ్చిన పర్యాటకులు జింకలకు బదులు కుక్కలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే కుక్కల సంఖ్య పెరగడంతో అవి తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని పర్యాటకులు భయపడుతున్నారు. వాటిని ఇక్కడి నుంచి తరలించాలని పర్యాటకులు, స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు. అయితే, బ్యాక్‌ వాటర్‌కు వేలాది ఎకరాల విస్తీర్ణం ఉండడం, అది ఇరిగేషన్‌ ల్యాండ్‌ కావడంతో అటవీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నారు. హద్దులు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.

రక్షణ చర్యలకు ఏ మార్గం లేదా?

డొంకేశ్వర్‌ మండలం చిన్నయానం, గంగాసముందర్‌, జీజీ నడ్కుడ, గాదేపల్లి వంటి గ్రామాల శివార్లలో జింకలు ఎక్కువగా ఉండేవి. ప్రతి ఏడాది వేసవిలో బ్యాక్‌వాటర్‌ తగ్గి పచ్చిక బయటళ్లు ఏర్పడడంతో ఆ పచ్చికను మేసేందుకు వస్తున్న జింకలను వీధి కుక్కలు వేటాడుతున్నాయి. జింకల మాంసానికి రుచి మరిగిన కుక్కలు నలుదిక్కులా మాటు వేసి వెంబడిస్తున్నాయి. దీంతో జింకలు భయంతో వేరేచోటికి కూడా వెళ్లిపోతున్నాయి. కుక్కల దాడిలో గాయపడిన జింకలను శివారు గ్రామాల ప్రజలు, మత్స్యకారులు కాపాడి అటవీ అధికారుల పర్యవేక్షణలో పశువైద్య అధికారులతో చికిత్స చేయిస్తున్నారు. చనిపోయిన వాటికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా గతనెల 6న ఒక జింక పిల్లను కుక్కల బారి నుంచి కాపాడి అటవీ అధికారులకు అప్పగించారు. అదే నెల 28న కుక్కల దాడిలో గాయపడిన చుక్కల జింక నడ్కుడ గ్రామంలోకి వచ్చింది. స్థానికులు దానిని పట్టుకొని వైద్యం అందించారు. అయితే, జింకల రక్షణకు అధికారులకు ఏ మార్గం కనిపించడం లేదు. వేలాది ఎకరాలున్న బ్యాక్‌ వాటర్‌లో ట్రెంచ్‌ ఏర్పాటు చేయడం అతి కష్టం. సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కుక్కలకు కారుణ్య మరణం కల్పించాలనే డిమాండ్‌ తెరపైకి వస్తోంది.

నిరంతరం పర్యవేక్షిస్తున్నారు..

వేలాది ఎకరాల్లో బ్యాక్‌ వాటర్‌ ఏరి యా విస్తరించి ఉంది. దీంతో కుక్కల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి వీలు లేకుండా ఉంది. ఇరిగేషన్‌ ల్యాండ్‌ కావడంతో అటవీ శాఖ అజమాయిషీ చేయలేకపోతోంది. జింకలు, వన్యప్రాణుల రక్షణకు బ్యాక్‌ వాటర్‌లో ఒక డీఆర్వోతో పాటు బీట్‌ ఆఫీసర్‌ ఉన్నారు. వారు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో జింకలను ఎప్పటికప్పుడు రక్షిస్తున్నారు.

– సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, జిల్లా అటవీ అధికారి

ఎకో టూరిజం మాటేమో గానీ.. ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో జింకలకు మనుగడ లేకుండా పోతోంది. స్వేచ్ఛగా విహరించే ఈ వన్యప్రాణులను ఊర కుక్కలు వేటాడి పీక్కుతింటున్నాయి. ప్రతిఏటా ఎన్నో జింకలు కుక్కల నోట చిక్కి ప్రాణాలు విడుస్తున్నాయి. ఫలితంగా బ్యాక్‌ వాటర్‌లో

జింకల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.

ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో

వన్యప్రాణులకు రక్షణ కరువు

పచ్చిక బయళ్లలో మాటు వేసి

వేటాడుతున్న ఊర కుక్కలు

దాదాపుగా కనుమరుగవుతున్న

జింకల సంఖ్య

వేల ఎకరాల విస్తీర్ణం ఉండడంతో

రక్షణ చర్యలు చేపట్టలేని పరిస్థితి

Advertisement
 
Advertisement
Advertisement