నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10వ తేదీలలో పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభల నిర్వహణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, వి విధ శాఖల అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సభల నిర్వహణ, విధి, విధానాలపై అవగాహన కల్పించడం గురించి అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు ఒకరోజు ముందే టాంటాం ద్వారా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వా రా ప్రజలకు ముందస్తుగానే సమాచారం అందించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై సభలలో అవగాహన కల్పించాలన్నారు. ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు పంటల మార్పిడి, వర్షపు నీటి నిలువ, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ, వాల్టా, వన్యప్రాణి సంరక్షణ చట్టాల గురించి తెలియజేయాలన్నారు. రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాలు, సానిటేషన్ నిర్వహణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్‌వో గీత, డీఎఫ్‌వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్‌డీవో సాయన్న, జె డ్పీ సీఈవో సాయగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించాలి
ఖరీఫ్‌లో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
అధికారులకు అదనపు కలెక్టర్ల
సూచనలు


