● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
● నియోజకవర్గంలో విస్తృత పర్యటన
● ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
రెంజల్/ నవీపేట / బోధన్ టౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను తీరుస్తుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్, నవీపేట, బోధన్ పట్టణాల్లో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ గృహ ప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం బోధన్ నియోజకవర్గానికి ఒక్క ఇళ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులను గుర్తించి ఒక్క రెంజల్ మండలానికి వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. విడతల వారీగా అవసరమైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. చివరి బిల్లు మంజూరులో కొంత జాప్యం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అధికారులతో చర్చించి సకాలంలో అందించే ఏర్పాటు చేస్తానన్నారు. రెంజల్‌లో రైతులు, వ్యవసాయ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వానాకాలంలో సీజన్‌కు సంబంధించి రైతులకు ఇబ్బందులు రానీయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాగు నీరు, ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. రెంజల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్, సర్పంచ్‌లు ధనుంజయ్, ఎత్తరి మాధవి, లచ్చవార్ సుహసిని, తిరుపతి లలిత, మాధవ్, నాయకులు సాయిబాబాగౌడ్, రాములు, ఆసాని అనిల్ తదితరులు పాల్గొన్నారు. నవీపేటలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, సర్పంచ్ కేఎల్‌వీ రేఖ, ఉప సర్పంచ్ నవీన్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రాజేంద్రకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి, అనీసానగర్, రాకాసీపేట్‌లో ఇందిరమ్మ గృహ ప్రవేశాలను సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, కౌన్సిలర్ లక్ష్మి రామ్మూర్తి, పట్టణ అధ్యక్షుడు దాము, మున్సిపల్ ఫ్లోనర్ లీడర్ శరత్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


