డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఎకో టూరిజం పనులు గమ్యం చేరని చందంగా తయారయ్యాయి. ముఖ్యంగా డొంకేశ్వర్ మండలం గాదేపల్లి (చిన్నయానం) వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగినా, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రాజెక్టును ప్రకటించి మూడేళ్లవుతున్నా ఇంకా కాగితాల్లోనే ఉంది. డిజైన్ల ఆమోదంలో అధికారుల వద్ద జరుగుతున్న జాప్యం కారణంగా పర్యాటక ప్రేమికులను నిరాశకు గురి చేస్తోంది. 2023 జూలైలో ప్రభుత్వం టూరిజం ప్రకటన చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర అటవీ ఉన్నతాధికారులు ఎన్నోసార్లు వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పీసీసీఎఫ్ సువర్ణ, ఎఫ్‌డీసీ డైరెక్టర్ రంజిత్‌నాయక్‌లు వచ్చి సైట్ విజిట్ చేశారు. మార్చి లేదా ఏప్రిల్‌లో పనులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. అయితే మే నెల కూడా పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు వర్క్ పేపర్ స్థాయిలోనే ఉండిపోయింది. కేవలం డిజైన్ అప్రూవల్స్ కోసమే నెలల తరబడి సమయం వృథా కావడంతో ఈ ఏడాది కూడా పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
కొత్త డీఎఫ్‌వోపైనే ఆశలు!
జిల్లా అటవీ శాఖ అధికారిగా ఇటీవల సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన 2018 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి కాగా, మొన్నటి వరకు ఖమ్మం జిల్లా డీఎఫ్‌వోగా పని చేశారు. ఈయన పర్యాటకం, అడవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారని అటవీ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. గాదేపల్లి ఎకో టూరిజం పనులపై దృష్టి పెట్టి గట్టెక్కిస్తారనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.
అన్ని అడ్డంకులు తొలగినా..
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది. వేసవిలో పచ్చని నేలలు బయటకు తేలడంతో విదేశీ పక్షులు, కృష్ణ జింకలు సందడి చేస్తాయి. ఇక్కడ బోటింగ్, కాటేజీలు, వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తే జిల్లాకు మంచి గుర్తింపు వస్తుంది. దీనికి సంబంధించి 18 ఎకరాల స్థలం సేకరణ పూర్తి కావడం, సఫారీ వాహనాలు కొనుగోలు చేయడం, నిధుల పరంగా లైన్ క్లియర్ అవ్వడంతో పనులు వేగవంతం అవుతాయని అంతా భావించారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం, డిజైన్ల ఖరారులో జరుగుతున్న ఆలస్యం ప్రాజెక్టును నీరుగారుస్తోంది. అలాగే టూరిస్టు గైడ్‌లుగా స్థానిక గాదేపల్లి, చిన్నయానం, జీజీ నడ్కుడ గ్రామాలకు చెందిన యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఎలాంటి కదలిక లేదు.
డిజైన్ల ఆమోదంలో తీవ్ర జాప్యం
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మొదలు
కావాల్సిన పనులు
ఇప్పటి వరకు కదలిక లేని వైనం
అధికారుల్లో కరువైన ఉత్సాహం


