మానవ సేవే.. మాధవ సేవ
● నగరంలో నిత్యాన్నదానం
● గుర్తుతెలియని మృతదేహాలకు
అంత్యక్రియల నిర్వహణ
● మతిస్థిమితం లేనివారికి సపర్యలు
నిజామాబాద్ రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములనే కొందరు పట్టించుకోవడం లేదు. అలాంటి సమాజంలో విధి వంచితులను అక్కున చేర్చుకుంటూ ఆకలిదప్పికలను తీరుస్తోందీ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి. గతం మరిచి, పెరిగిన జుట్టు, గడ్డం, మసిబరిన బట్టలతో మండుటెండల్లో రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉన్న అనామకులను చేరదీస్తోంది. సపర్యలు చేస్తూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
నలుగురితో మొదలై..
ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థను 2011లో జిల్లాలోని ధర్మారం(బీ) గ్రామానికి చెందిన మద్దుకూరి సాయిబాబు ప్రారంభించారు. మొదటగా నలుగురితో ప్రారంభమైన సంస్థలో ప్రస్తుతం 100 మంది వరకు సేవలందిస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు జిల్లా కేంద్రంలో 100 మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతోంది. మతిస్థితిమితం లేని వారిని అక్కున చేర్చుకొని శుభ్రపరిచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల సహకారంతో సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది. ఇదే కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి, వారి అస్తికలను కాశీలోని గంగలో కలుపుతున్నారు. శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేస్తున్నారు.
మానవ సేవే.. మాధవ సేవా అనుకుంటూ ఇందూరు యువ త స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వ ర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. విధివంచితుల వివరాలు తెలిసిన వెంటనే స్పందిస్తాను. సమాజ సేవ కోసమే జీవితాన్ని అంకితం చేస్తూ పెళ్లి కూడా చేసుకోదలుచుకోనలేదు.
– ఎం సాయిబాబు, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు


