నిజాంపేట(మెదక్): టిఫిన్ చేస్తూ కుప్పకూలిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా నిజాంపేటలో ఘటన చోటు చేసుకోగా, మృతుడు కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాలాపూర్‌కి చెందిన చాకలి రాజు(42) మంగళవారం ఉదయం నందిగామకు బయలుదేరాడు. మార్గమధ్యలో నిజాంపేటలోని ఒక హోటల్‌కు టిఫిన్ చేసేందుకు వచ్చాడు. టిఫిన్ చేస్తున్న క్రమంలో అతడికి ఫిట్స్ వచ్చి ఆహారం ఊపిరితిత్తులోకి వెళ్లడంతో కింద పడిపోయాడు. వెంటనే హోటల్ యాజమాన్యం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి పరిశీలించగా అతడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
బావిలో పడి వృద్ధురాలు..
ఇందల్వాయి: మండలంలోని డొన్కల్ గ్రామంలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. వివరాలు ఇలా.. డొన్కల్ గ్రామా నికి చెందిన గొల్ల మల్లవ్వ (60) అనే వృద్ధురాలు సమీపంలోని అడవిలో నిత్యం తునికాకు సేకరణకు వెళ్తుండేది. ఈక్రమంలో మంగళవారం ఉదయం తునికాకు సేకరణకు వెళ్లి ప్రమాదవశాత్తు తమ వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. మృతురాలి కొడుకు రమేష్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు..
నవీపేట: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ఫకీరాబాద్ గ్రామానికి చెందిన వంకదారిగోపి(25) కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఈనెల 1న ఆస్పత్రికి వెళ్లి మందులు తీసుకున్నాడు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో అతడు జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో ఈ నెల 2న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


