లెక్క రాలేదు.. సైన్స్‌ ఎక్కలేదు! | - | Sakshi
Sakshi News home page

లెక్క రాలేదు.. సైన్స్‌ ఎక్కలేదు!

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

ఖలీల్‌వాడి: విద్యార్థి జీవితంలో మొదటి టర్నింగ్‌ పాయింట్‌గా భావించే పదో తరగతిలో చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్‌లో ఫెయిల్‌ కావడం చర్చనీయాంశమైంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యార్థులు మొత్తం 24,365 మంది పరీక్షలు రాశారు. 22,961 మంది పాస్‌ కాగా, 1404 మంది ఫెయిల్‌ అయ్యారు. అత్యధికంగా మ్యాథ్స్‌లో 619 మంది, సైన్స్‌లో 605 మంది అనుత్తీర్ణులు కాగా, తెలుగులో 143 మంది, హిందీలో 13, ఇంగ్లిష్‌లో 461, సోషల్‌లో 97 మంది తడబడ్డారు. మాతృభాష తెలుగు కాగా, ఇంగ్లిష్‌ మీడియంలో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ తెలుగు, ఇంగ్లిష్‌లో సైతం విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు.

11 స్థానాలు కిందకు..

గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. మూడేళ్లపాటు మెరుగైన స్థానంలో నిలిచినప్పటికీ.. ఈసారి ఫలితాల్లో మాత్రం 11 స్థానాలు కిందకు పడిపోయి రాష్ట్రస్థాయిలో 27వ స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలనే సంకల్పంతో డీఈవో పార్శి అశోక్‌ ఆధ్వర్యంలో విద్యాశాఖ స్పెషల్‌ క్లాస్‌లు ఏర్పాటు చేసి పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించింది.

హెచ్‌ఎంలు, ఎంఈవోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేశారు. డిసెంబర్‌లో సిలబస్‌ పూర్తి చేయించారు. దీంతో ముందుగానే రివిజన్‌ మొదలు పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు విద్యార్థుల హాజరు, సబ్జెక్టుల వారీగా రిపోర్టులు పరిశీలిస్తూ వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఈ పాఠశాలల నుంచి 1345 మంది పరీక్షలు రాయగా.. 982 మంది, ఎయిడెడ్‌ స్కూళ్ల నుంచి 503 మందికిగాను 457 మంది, జిల్లా పరిషత్‌ పాఠశాలల నుంచి 8,130 మందికి గాను 7521 మంది, ఆశ్రమ పాఠశాలల నుంచి 71 మందికి గాను 69 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బీసీ వెల్ఫేర్‌ నుంచి 801 మందికి గాను 801, కేజీబీవీల నుంచి 1040 మందికి గాను 1018 మంది, మోడల్‌ స్కూళ్ల నుంచి 856 మందికి గాను 832 మంది, రెసిడెన్షియల్‌ స్కూళ్ల నుంచి 216 మందికి గాను 216 మంది, మైనార్టీ రెన్సిడెన్షియల్‌ నుంచి 659 మందికి గాను 646 మంది, సోషల్‌వేల్పేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నుంచి 624 మందికి గాను 610 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్స్‌ నుంచి 113 మందికి గాను 113 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

వంద శాతం ఉత్తీర్ణత

జిల్లాలో 15 కేజీబీవీలు, 13 బీసీ వేల్పేర్‌ పాఠశాలలు(జిల్లాలో ఉన్నవి), ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల, మోడల్‌ స్కూళ్లు ఒక్కొక్కటి చొప్పున, 97 ప్రయివేట్‌ స్కూళ్లు, మూడు రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 10 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 6 సోషల్‌వేల్పేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, రెండు ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్స్‌, 108 జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.

పది ఫలితాల్లో విద్యార్థుల పరిస్థితి

జిల్లాలో 1404 మంది ఫెయిల్‌

అత్యధికంగా మ్యాథ్స్‌లో 619 మంది..

సైన్స్‌లో 605 మంది అనుత్తీర్ణత

మండలాల్లో మెరుగుపడిన రిజల్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement