రెండో ఓటుకు
జిల్లాలో గణనీయమైన సంఖ్యలో ఇతర రాష్ట్రాల వలస ఓటర్లు
ఆర్మూర్: జిల్లాలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థిరపడిన వారు గణనీయంగా ఉన్నారు. వీరికి వారి రాష్ట్రాలతో పాటు ఇక్కడ ఓటు హక్కు ఉన్న విషయం గమనార్హం. స్థానిక రాజకీయ నాయకులే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ఓటరు కార్డులను ఇప్పిస్తున్నారన్నది బహిరంగ సహస్యం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో ఇలాంటి వారు ఎందరు బయట పడతారో అన్నది చర్చనీయాంశంగా మారింది.
● ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి భవన కార్మికులుగా, మేసీ్త్రలు గా ఉపాధి కల్పించుకున్న వారు వేల సంఖ్యలో ఉంటారు. అదే విధంగా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి బంగారం నగల తయారీ పరిశ్రమలో ఉపాధి కోసం వేల సంఖ్యలో వలస వచ్చారు. ఒక్క ఆర్మూర్ పట్టణంలోనే వీరి సంఖ్య రెండు వేలకు పైగా ఉంటుంది. ఇక రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి టైల్స్ వ్యాపారంతో పాటు రాందేవ్ ప్లాస్టిక్స్, సూపర్ మార్కెట్లు, పలు హోల్ సేల్ వ్యాపారాలు చేసే వారు వలస వచ్చారు. ఇక గ్రామాల్లో టబ్బులు, రెడీమేడ్ మంచాలు, పరుపులు అమ్మే వ్యక్తులు వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఉన్నారు. వీరందరికీ ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు నకిలీ ఆధార్ కార్డులు ఇప్పించి ఓటు హక్కును సైతం కల్పించారు. కాగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన సమయంలో వీరంతా తమ రాష్ట్రాల్లో ఓటు వేయడానికి మూకుమ్మడిగా వెళ్లడం కనిపిస్తుంది. వీరే స్థానిక ఎన్నికల్లో సైతం ఓట్లు వేస్తున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారు ఎస్‌ఐఆర్ సర్వేలో పట్టుబడే అవకాశం ఉంది. 2002 నాటి ఓటర్ లిస్టును ఏఐ పరిజ్ఞానంతో పోల్చి చూస్తూ డబుల్ ఓటు ఉన్న వారిని గుర్తించే అవకాశం ఉండటంతో ఆర్మూర్ పట్టణంతో పాలు, జిల్లాలో ఎస్‌ఐఆర్ గురించి ప్రాధానంగా చర్చ జరుగుతోంది. నకిలీ ఓటర్లను గుర్తించే అవకాశం ఉండటంతో సదరు వలసదారులు తమకు ఓటు హక్కు ఇప్పించిన రాజకీయ పార్టీల నాయకులను కలిసి తమ ఓటు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు.
బంగ్లాదేశ్ వాసులు కూడా!
ఆర్మూర్ పట్టణానికి పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి బంగారు వ్యాపారి వద్ద కార్మికుడిగా పని చేస్తున్న ఓ యువకుడు తాజాగా పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అంతవరకు సమస్య లేదు.. కానీ ఇదే వ్యక్తి ఇటీవల ఆర్మూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇదేట్లా జరిగిందని ఆరా తీయగా.. సదరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బంగారు నగల కార్మికుడికి రెండు రాష్ట్రాల్లో ఓటరు కార్డులు మంజూరు అయి ఉన్నాయి. స్థానిక రాజకీయ నాయకులు అతనికి ఓటరు కార్డును ఇప్పించడమే ఇందుకు కారణం.
ఓటరు జాబితా వెరిఫికేషన్ చేస్తున్నాం..
ఓటరు జాబితాలో వెరిఫికేషన్, అప్డేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. 2002 ఓటర్ లిస్టులో ఉన్న ఓటరును ప్రస్తుతం ఉన్న 2025 ఓటర్ లిస్ట్ తో మ్యాపింగ్ చేస్తారు. 2025లో ఉన్న వారి వారసులను 2002 ఓటర్ లిస్టులో ఉన్న వారి తల్లిదండ్రులకు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఓటరు వ్యక్తిగత బాధ్యతతో స్వతహాగా ముందుకు వచ్చి తమ తమ ఓటర్ వివరాలను పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన బీఎల్వో ద్వారా నమోదు చేయించుకోవాలి.
– నడిమెట్ల సత్యనారాయణ, తహసీల్దార్ ఆర్మూర్
పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్మూర్ ప్రాంతానికి వలస వచ్చిన వారిలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ వారు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వలసదారుల వివరాలు సేకరించే సరైన వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేకపోవడంతో వలస కార్మికులు ఎక్కడివారో గుర్తించే పరిస్థితులు ఇక్కడ లేవు. పలు సందర్భాల్లో బంగారు వ్యాపారుల వద్ద కార్మికుడిగా పని చేస్తూ పెద్ద మొత్తంలో బంగారం, డబ్బులు ఎత్తుకొని పారి పోయిన ఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వీరిని తిరిగి పట్టుకోవడం వ్యాపారులకు కష్టంగా ఉండటమే కాదు పోలీస్ వ్యవస్థ సైతం విఫలం అవుతుండటంతో అక్రమార్కులు ఏ దేశం వారో అనే ఆందోళన నెలకొని ఉంది.
ఇటీవల ఓ రాష్ట్రానికి ఓటేసేందుకు ఆర్మూర్ నుంచి మూకుమ్మడిగా
వెళ్లిన వైనం
బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారెందరో..
ఎస్‌ఐఆర్ తో డబుల్ ఓటర్లకు గుబులు


