2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్‌ అమలు | - | Sakshi
Sakshi News home page

2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్‌ అమలు

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

సుభాష్‌నగర్‌: 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్‌ అమలు కానుందని, ఈ బిల్లు ఆమోదం దేశ రాజకీయాల్లోనే చరిత్రాత్మక ఘట్టమని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందడం బీజేపీ చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనమన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనతోపాటు మహిళా రిజర్వేషన్‌ అమలవుతుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో ప్రజాస్వామ్యం బలోపేతం కావడంతోపాటు అవినీతి తగ్గుతుందని, మంచి పాలన అందుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ మహిళలు, కులాలను రాజకీయాలకు వాడుకుందని ఆరోపించిన అర్వింద్‌.. 30 ఏళ్ల మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు నేటి మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదింపజేసి వారి కలను సాకారం చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో కొందరు ప్రజాప్రతినిధులు అపోహలు, అభద్రతకు లోనవుతున్నారని, నియోజకవర్గ పునర్విభజనతో పెరిగే సీట్లతో వారికి అవకాశం కలుగుతుందని అన్నారు. రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లు చేపడతారని స్పష్టంచేశారు. 543 ఎంపీ స్థానాల నుంచి 816కు పెరుగుతున్నాయని గుర్తుచేశారు.

అసత్య ప్రచారం..

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశంలో సీట్లు కోల్పోతామని, జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలకు పునర్విభజనతో నష్టం జరుగుతుందని కొన్ని పార్టీలు అసత్యప్రచారానికి తెర లేపుతున్నాయని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. దేశంలోని కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో 50శాతం స్థానాలు పెరుగుతాయని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు న్యాలం రాజు, ప్రమోద్‌కుమార్‌, విజయలక్ష్మి, మల్లేశ్‌యాదవ్‌, బంటు రాము, జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళా బిల్లు ఆమోదం దేశ రాజకీయాల్లోనే చరిత్రాత్మక ఘట్టం

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు

50శాతం సీట్ల పెంపు

మహిళలు, కులాలతో కాంగ్రెస్‌ రాజకీయం

మీడియాతో ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement