కలెక్టరేట్‌ వద్ద బీజేపీ శ్రేణుల నిరసన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ వద్ద బీజేపీ శ్రేణుల నిరసన

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని కలెక్టరేట్‌ వద్ద మంగళవారం బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ, లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి ఇరువురి మధ్య వాగ్వాగం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌పటేల్‌ కులాచారి మాట్లాడుతూ.. ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు రైతులతో కలిసి వెళితే.. కలెక్టరేట్‌ గేట్లు మూసివేసి, లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ వచ్చి తమను లోపలికి తీసుకువెళ్లినప్పటికీ, కలెక్టర్‌ కనీసం బయటకు వచ్చి అన్నదాతల గోడు వినకపోవడం అత్యంత శోచనీయం అన్నారు. అకాల వర్షాలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 6000 ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించిందన్నారు. తక్షణమే రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారుల క్షేత్రస్థాయిలో పంట నష్టంపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించాలన్నారు. నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, కందగట్ల రాంచందర్‌, పానుగంటి సతీష్‌ రెడ్డి, నాయిడి రాజన్న, అమంద్‌ విజయ్‌, గంగాధర్‌, వినోద్‌రెడ్డి, కోల ఇంద్రకరణ్‌, ద్యాగ సరిన్‌ తదితరులు పాల్గొన్నారు.

మూల్యాంకన డబ్బులను చెల్లించాలి

ఖలీల్‌వాడి: పదో తరగ తి మూల్యాంకనం నిర్వ హించిన ఉపాధ్యాయులకు డబ్బులను చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం నాందేవ్‌వాడలోని నిర్మలా హృదయ్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పదవ తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద టీటీజేఏసీ, యూఎస్పీసీ, జాక్టో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మోహన్‌రెడ్డి, రమేష్‌, ధర్మేందర్‌ మాట్లాడుతూ.. గత సంవత్సరం జరిగిన పదవ తరగతి మూల్యాంకనం డబ్బులను ఇంతవరకు చెల్లించలేదన్నారు. రెండు సంవత్సరాల క్రితం చేసిన కుల గణన సర్వే పారితోషకాన్ని ఇంతవరకు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వెంటనే పదో తరగతి మూల్యాంకనం రేట్లు పెంచి చెల్లించాలని, కుల గణన సర్వే డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. లేదంటే రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిస్తామన్నారు. అనంతరం మూల్యాంకనం కేంద్రంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. నాయకులు కిషన్‌, జమీలుల్లా, గంగాధర్‌, ఓమాజీ, రమేష్‌, రమణ, ఆనంద్‌ పాల్గొన్నారు

పోలీసుల అదుపులో సైబర్‌ నిందితులు

నిజామాబాద్‌ అర్బన్‌: ౖసెబర్‌ నేరాలకు పాల్పడుతున్న పదిమందిని నాలుగో టౌ న్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల నాలుగోటౌన్‌ పోలీస్‌ స్టేషన్లో సైబర్‌ మో సాలపై కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు వివిధ ప్రాంతాలలోని సైబర్‌ నేరగాళ్లను గుర్తించి అరెస్టు చేశారు. నిందితులు అక్రమంగా బ్యాంకు ఖాతాలను తెరిపిస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement