● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● బోర్గాం(పి)లోని పదో తరగతి
పరీక్ష కేంద్రం తనిఖీ
మోపాల్: పదో తరగతి పరీక్షల్లో ఎక్కడ కూడా మాస్ కాపీయింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నగరశివారులోని బోర్గాం(పి) 5వ డివిజన్ పరిధిలోగల సాక్రేడ్ హార్ట్ అకాడమీ పాఠశాలలో కొనసాగుతున్న పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్ రమేష్‌కు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లను అనుమతించకూడదని, అనవసర తప్పిదాలకు తావిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లోగల ఈవీఎం గోడౌన్‌ను మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు ఉన్నారు.


