నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయి చైతన్య బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని, సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను వివరించాలని సూచించారు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు తిరిగి బాధితులకు అప్పగించారు. 18 మంది బాధితులకు 18 సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ రఘుపతి మాట్లాడుతూ ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. తద్వారా వాటిని గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ కార్యక్రమంలో భాగంగా ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’ పై ఈ నెల 25న వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో ఉదయం 10 గంటలకు వర్క్‌షాప్ ప్రారంభమవుతుందని ప్రోగ్రాం డైరెక్టర్ రాంబాబు సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల నుంచి వ్యక్తిగత సమాచారం రక్షణకు అవసరమైన జాగ్రత్తలు, సురక్షిత ఆన్‌లైన్ వినియోగం, పాస్‌వర్డ్ భద్రత, ఫిషింగ్ మోసాలు వంటి అంశాలపై నిపుణులు సూచనలు అందిస్తారని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో పాల్గొనే వారికి క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు, అధ్యాపకులు వర్క్‌షాప్‌కు హాజరుకావాలని కోరారు.
హామీలను అమలు చేయాలి
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ బీజేపీ నాయకులు సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. పోలీసులు ముందస్తుగా ప్రధాన నాయకులను అరెస్టు చేయడంతో జిల్లా అధ్యక్షుడితోపాటు పలువురు కలెక్టరేట్‌కు చేరుకొని ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రమోద్ కుమార్, పాలెపురాజు, జ్యోతి, వేణు, అనిల్, ఓంసింగ్, రాజన్న, చింత ప్రసూనారెడ్డి, బొబ్బిలి వేణు తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో రైతు సరుకును సంరక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కమీషన్ ఏజెంట్ లైసెన్స్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆదేశాల మేరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజులపాటు సదరు కమీషన్ ఏజెంట్ మార్కెట్‌లో వ్యాపార లావాదేవీలను నిలిపివేశామన్నారు. వ్యాపారులు రైతులు తెచ్చిన సరుకును తూకమయ్యే వరకు జాగ్రత్తతో కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కమీషన్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
● రూ.15 వేలు జరిమానా విధించిన కామారెడ్డి కోర్టు
కామారెడ్డి క్రైం: బాలికపై లైంగిక దాడికి యత్నించిన నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పు వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2021 మార్చి 21న పాఠశాలకు సెలవు ఉండటంతో ఇంటిదగ్గరే ఉంది. చాకలి లక్ష్మణ్ అనే వ్యక్తి బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఎవరికై నా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. బాలిక ద్వారా విషయం తెలియడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. సాక్ష్యాలను పరిశీలించిన జిల్లా జడ్జి సీహెచ్‌వీఆర్‌ఆర్ వరప్రసాద్ నేరం రుజువు కావడంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. కేసును సరైన పద్ధతిలో విచారించిన, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన పీపీ శేషు, పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.
బ్లాక్ సిలిండర్ల గుట్టురట్టు
● ఒక్క సిలిండర్‌ను రెండుగా మారుస్తున్న వైనం
● ఆటో, 16 సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
బాన్సువాడ రూరల్: ఒక్క సిలిండర్ గ్యాస్‌ను రెండుగా, రెండు సిలిండర్ల గ్యాస్‌ను మూడు సిలిండర్లలోకి మారు స్తున్న బ్లాక్ మార్కెట్ దందా వెలుగులోకి వచ్చింది. సోమ వారం నిజాంసాగర్‌కు చెందిన వీరభద్ర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ ఆటోలో కొంతమంది బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి వెళ్లే రోడ్డులో ఓ ప్రత్యేక పరికరం ద్వారా ఒక సిలిండర్ గ్యాస్‌ను రెండింటిలోకి మారుస్తూ కనిపించారు. అలా మార్చిన సిలిండర్లను బ్లాక్‌లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తుండటాన్ని స్థానికులు గమనించడంతో ఆ వ్యక్తులు పారిపోయారు. కాగా, ఎక్కడ దొరికిపోతామనే భయంతో ఆటోను వేగంగా నడిపి ఓ టీవీఎస్ ఎక్సెల్‌ను ఢీకొట్టారు. అనంతరం ఆటోను వదిలి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 16 సిలిండర్లతో కూడిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.


