● జిల్లాలో ప్రాముఖ్యత గల దేవాలయం
● నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
● 27న కల్యాణం, 28న రథోత్సవం
నిజామాబాద్ రూరల్: జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది నగరంలోని సుభాష్‌నగర్ శ్రీరామాలయం. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. నిత్య పూజలు, ప్రత్యేక హోమాలు, అభిషేకాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ప్రధానంగా శ్రీరామనవమి వేడుకలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి రామాలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు జరిగే విశేష పూజలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్‌పర్సన్ సరళామహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభానవీన్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఉత్సవ కార్యక్రమాలు ఇలా..
24 మంగళవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, ధృవమూర్తులకు స్నపన తిరుమంజనం, పంచామృతాభిషేకం, సాయంత్రం 5 గంటలకు నిత్యారాధన, విష్ణు సహస్రనామ పారాయణం, అఖండ దీపారాధన తదితర పూజలు నిర్వహిస్తారు. 25 బుధవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన, కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం(గరుడ వివాహము) బలిహరణం ఉంటుంది. 26 గురువారం 7 గంటలకు నిత్యారాధన, అవాహిత దేవతాపూజ, నిత్యహోమములు, సాయంత్రం 5 గంటలకు నిత్యాహోమం, పారాయణములు, మూల మంత్ర హోమం, ఆరగింపు, బలిహరణం, మంగళాశాసన తీర్థగోష్టి, ఉలుకపూజ(కొట్నం పుణ్యాహవాచనం) నిర్వహిస్తారు. 27న ఉదయం 7 గంటలకు నిత్యారాధన, అవాహిత దేవతాపూజ, నిత్యహోమం, పారాయణములు, 9 గంటలకు ఎదుర్కోలు, శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం నిత్యారాధన, నిత్యహోమం విశేష పూజలు ఉంటాయి. 28న ఉదయం 7 గంటలకు నిత్య పూజలతోపాటు సాయంత్రం రథోత్సవం ఉంటుంది. 29న దోపు ఉత్సవం, చక్రతీర్థం, గరుఢధ్వజ అవరోహణం, ఏకాంతసేవ, 30న స్వామివారికి మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు.


