ఏఐతో ఔషధ రంగంలో అపార అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

ఏఐతో ఔషధ రంగంలో అపార అవకాశాలు

Mar 24 2026 8:45 AM | Updated on Mar 24 2026 8:45 AM

తెయూ(డిచ్‌పల్లి): ఔషధ రంగంలో కృత్రిమ మేధ ను ఉపయోగించుకొని మరిన్ని ఎక్కువగా ఔషధ ఆవిష్కరణలు సాధించవచ్చని ఐఐటీ హైదరాబాద్‌ బయోటెక్నాలజీ విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ నరహరి శాస్త్రి పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘అడ్వాన్సెస్‌ ఇన్‌ కెమికల్‌ బయాలజీ – నవెల్‌ థెరప్యూటిక్స్‌’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజు ల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న నరహరి శాస్త్రి మాట్లాడుతూ సాంకేతికతలు ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడంలో, డేటా విశ్లేషణలో, వ్యక్తిగత వైద్యంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. విజ్ఞానశాస్త్ర అభివృద్ధి కోసం ఏఐను వివేకంతో ఉపయోగించుకోవాలని సూచించారు.తెయూ నుంచి కొంతమంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. చీఫ్‌ ప్యాట్రన్‌గా వ్యవహరించిన తెయూ వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు మాట్లాడుతూ ఆరోగ్యరంగ అభివృద్ధికి కెమికల్‌ బయాలజీ కీలకమన్నారు. ముఖ్యంగా పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ (హైదరాబాద్‌) చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సురేశ్‌బాబు మాట్లాడుతూ.. దైనందిన జీవింతో సంప్రదాయ వైద్యం ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మూలికా ఔషధాలలో జరిగే కల్తీ ఉత్పత్తులను ఎలా గుర్తించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ అడెపు రాజు మాట్లాడుతూ కెమికల్‌ బయాలజీ ఆధారిత పరిశోధనలపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. సదస్సుకు ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా డాక్టర్‌ సత్యనారాయణ, ఆర్గనైజింగ్‌ చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ శిరీష బోయపాటి, కన్వీనర్‌గా డాక్టర్‌ వాసం చంద్రశేఖర్‌ వ్యవహరించారు. సదస్సులో వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ సదస్సులో ప్రముఖ శాస్త్రవేత్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement