● పోచారం శివారులోని కాలువలో మునిగి ఒకరి మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్‌పేటలో జరిగే జాతరకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పోచారం ప్రధానకాలువలో మునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మెదక్ జిల్లా హావేలి ఘన్‌పూర్ మండలం తిమ్మాయిపల్లికి చెందిన శగారి శ్రీధర్‌గౌడ్(33) అనే వ్యక్తి శుక్రవారం గోపాల్‌పేటలో జరుగుతున్న జాతరకు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రయినా అతను ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్‌చేయగా ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. కాగా మండలంలోని పోచారం గ్రామశివారులోగల పోచారం ప్రధానకావలువ మెట్లపై మొబైల్‌ఫోన్ ఉన్నట్లు గ్రామస్తులు నాగిరెడ్డిపేట పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు. ఇదేసమయంలో విషయం తెలుసుకున్న శంకర్‌గౌడ్ కుటుంబసభ్యులు పోచారం ప్రధానకాలువ వద్దకు చేరుకొని అతని కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఫైర్‌సిబ్బంది పోచారం చేరుకొని ప్రధానకాలువలో గాలించి శ్రీధర్‌గౌడ్ మృతదేహాన్ని వెలికితీశారు. జాతరకు వచ్చిన శ్రీధర్‌గౌడ్ పోచారం వద్దనున్న ప్రధానకాలువలో ప్రమాదశాత్తు కాలుజారి నీటిలోపడి మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఈమేరకు మృతుడి తల్లి భూదేవి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు.
ఇరువర్గాల ఘర్షణ.. 20 మందిపై కేసు
వర్ని: పొలం విషయంలో ఇరు వర్గాల వారు ఘర్షణ పడగా, 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధాపూర్ కోకల్‌దాస్ తండాకు చెందిన హరిలాల్, షంశేరావులు పొలం తమదంటే తమదంటూ కొన్ని సంవత్సరాలుగా ఘర్షణ పడుతుండగా, వివాదం కోర్టులో నడుస్తోంది. ఇదిలా ఉండగా శనివారం పొలం విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు సుమారు 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): మండలకేంద్రం శివారులోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మండలంలోని కల్వరాల్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం శనివారం ఆటోలో కామారెడ్డికి బయలుదేరింది. సదాశివనగర్ శివారులోని హైవేపై వారి ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.


