రేకులపల్లిలో దొంగల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

రేకులపల్లిలో దొంగల బీభత్సం

Mar 22 2026 2:02 AM | Updated on Mar 22 2026 2:02 AM

తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

ధర్పల్లి: మండలంలోని రేకులపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో తాళం వేసి ఉన్న ఆరు ఇళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చోరబడగా, మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ప్రవేశించి, తాళం వేసి ఉన్న ఆరు ఇళ్ల తాళాలను పగులగొట్టారు. మూడు ఇళ్లలో చోరీ చేశారు. శనివారం ఉదయం ఆయా ఇళ్ల తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించి బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. వెంటనే బాధిత కుటుంబాలు ఇళ్లకు చేరుకొగా, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. బాధితులు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీనివాస్‌ చోరీ జరిగిన తీరును పరిశీలించారు. మూడు ఇళ్లలో కలిసి రెండున్నర తులాల బంగారు ఆభరణాలతోపాటు కొంత నగదును ఎత్తుకెళ్లినట్లు ఎస్సై తెలిపారు. మరో మూడు ఇళ్లలో చోరీకి ప్రయత్నించిన ఎలాంటి వస్తువులు పోలేవని ఎస్సై పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

ఒకరు ధ్వంసం.. మరొకరు చోరీ

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని గోషాల రోడ్డులో పార్కింగ్‌ చేసిన కారులోనుంచి శుక్రవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు రూ.3లక్షల నగదు చోరీకి పాల్పడిన విషయం విధితమే. ఈ ఘటన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డవగా, శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చోరీకి పాల్పడింది ఇద్దరు వ్యక్తులుగా తెలుస్తోంది. మొదట ఒక వ్యక్తి హెల్మెట్‌ ధరించి, బైక్‌పై వచ్చి కారు అద్దాలను ధ్వంసం చేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి మరో గుర్తుతెలియని వ్యక్తి కారు వద్దకు వచ్చి కారులోని నగదు అపహరించారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని తెలిపారు.

పేకాడుతున్న ఆరుగురి అరెస్టు

నవీపేట: మండలంలోని జగ్గారావ్‌ ఫారమ్‌ గ్రామ శివారులోగల పేకాట స్థావరంపై శనివారం సాయంత్రం దాడి చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. పేకాడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు వివరించారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 3090 నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement