● మన చరిత్ర మూలాలు మనకు తెలియకపోతే మన భవిష్యత్తు శూన్యంగా మిగిలిపోతుంది. చరిత్ర అనేక పాఠాలు, గుణపాఠాలను నేర్పిస్తుంది. భారతీయుల మధ్య ఐక్యత లేని కారణంగా విదేశీయులు మన దేశం మీద దండయాత్రలు చేసి, దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేశారు. మళ్లీ భారతీయులంతా ఏకమై పోరాటాలు చేస్తే తప్ప స్వాతంత్రం లభించలేదు. ఆ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మళ్లీ మనం పరాయి పాలనలోకి వెళ్లడం ఖాయం. భారతీయులందరూ అసత్య అంశాలను కాకుండా వాస్తవ చరిత్రను చదువుకోవాలి.
● స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోవడానికి ప్రధాన కారణం భారతీయులు తమదైన వాస్తవ చరిత్ర తెలుసుకోకపోవడమే. ప్రపంచానికి వస్త్రాలు కట్టుకోవడం తెలియనప్పుడే భారతీయులు వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలను ధరించారు. వేల సంవత్సరాలుగా చెక్కుచెదరని రాతి నిర్మాణాలు చేశారు. మరుగుదొడ్ల నుంచి మొదలుపెట్టి అంతరిక్ష అధ్యయనం వరకు ప్రతి విషయంలోనూ భారతీయులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే విశేష జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కానీ, విదేశీ దు రాక్రమణలు, దాడుల్లో ధ్వంసమైన చరిత్ర కారణంగా తమ మూలాలను మర్చిపోయారు.
వివిధ వేదికల్లో యాదవరావుకు సత్కారాలు
నేను యువకుడిగా ఉన్నప్పటి నుంచి చరిత్ర కోసం నా యొక్క సగం జీతాన్ని ఖర్చు చేయడం మొదలుపెట్టాను. ఈ విషయంలో నా భార్య చేసిన సహకారం గొప్పది. నా ఇద్దరు కుమారులు డాక్టర్ అమృతరావు, ఆనంద్ చరిత్ర పరిశోధన వ్యాసావళి పేరుతో నేను రాసిన మొట్టమొదటి పుస్తకానికి రచన సహకారం అందించారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే పదివేలకు పైగా చరిత్ర పుస్తకాలను సేకరించగలిగాను. ఈ పుస్తకాలను కోటగల్లీలోని అశ్మక చరిత్ర గ్రంథాలయానికి ఉచితంగా అందజేశాను. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్, ఇతిహాస సంకలన సమితి, మహారాష్ట్ర ఇతిహాస్ పరిషత్ లాంటి వివిధ చరిత్ర అధ్యయన సంస్థలలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తున్నా. ఆయా సంస్థలు నిర్వహించే వార్షిక కార్యక్రమాలు, అన్ని సెమినార్‌లలో కచ్చితంగా పాల్గొంటున్నా.
ప్రస్తుతం నా వయస్సు 95 సంవత్సరాలు. నా చిన్నతనంలో బ్రిటిష్ ప్రభుత్వ దురాగతాలను, యువకుడిగా ఉన్నప్పుడు నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలను స్వయంగా కళ్లతో చూశాను. వాళ్ల దమనకాండతో నా తల్లిదండ్రులు చాలా భయపడేవారు. భారతీయులు దేశం గురించిన పరాక్రమవంతమైన చరిత్రను తెలుసుకోకపోవడమే ఇలాంటి దుస్థితికి ప్రధాన కారణమని అర్థమైంది. దీంతో చరిత్ర అధ్యయనం చేయడంతోపాటు ఇందూరు ప్రాంతానికి సంబంధించి వాస్తవిక చారిత్రక విషయాలను ఆధారాలతో సహా నిరూపించి భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో నా జీవితాన్ని అంకితం చేసి పని చేస్తున్నా. ఇందూరు చరిత్రపై ఇతిహాస సంకలన సమితి ద్వారా చాలా అనేక విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం కలిగింది.
భారతీయ చరిత్రకు ఆధారమైన దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు, గురుకులాలను, మన దేశ జీవన విధాన శైలిని, కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో సఫలీకృతులయ్యారు. పాఠ్యపుస్తకాల్లోనూ అసత్యాలతో కూడిన చరిత్ర చొప్పించారు. ఎంతోమంది పరాక్రమవంతులైన మహారాజులు, చక్రవర్తులను పిరికిపందలుగా, విదేశీ దురాక్రమణదారులను మహా గొప్ప ప్రజాపాలకులుగా తప్పుడు చరిత్రను రాసి తరతరాలుగా మన మెదళ్లలో అసత్యాలను నింపుతూ వచ్చారు. అలాంటి వాటి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇప్పుడు కొన్ని విశేష ప్రయత్నాలు జరుగుతున్నాయి.
‘ఇతిహాస సంకలన సమితి’ చరిత్ర కోసమే పుట్టి, చరిత్ర కోసమే పునరంకితమైన ఒక జాతీయవాద చరిత్ర అధ్యయన సంస్థ. ‘నమూలం లిఖతే కించిత్’. ఆధారాలు లేకుండా దేనినీ రాయకూడదనే ఏకై క సూత్రం ఆధారంగా సుమారు 50 ఏళ్లుగా, దేశంలోని అనేక మరుగున పడిపోయిన చారిత్రక విశేషాలను ఆధారాలతో సహా గుర్తించి నేటి తరానికి అందించడంలో విశేష కృషి చేస్తోంది. సరస్వతి నది పూర్తి అస్తిత్వాన్ని అధ్యయనం చేసి, ఆ నదిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఇతిహాస సంకలన సమితికే దక్కుతుంది.
ఇందూరు జిల్లాలో చరిత్ర పరిరక్షణ కోసం ఇతిహాస సంకలన సమితి నిర్విరామంగా పనిచేస్తోంది. 5 సంవత్సరాలుగా సుమారు 50కి పైగా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రస్తుతం ఇందూరు జిల్లా సమగ్ర చరిత్ర అనే పుస్తకాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇందూరు జిల్లాకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇందూరు ప్రాంతం మహనీయుల ద్వారా పరిపాలించబడింది. జిల్లాలోని కందకుర్తి గ్రామంలో స్వయంగా శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో పర్యటించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి అనే విషయం అత్యంత ప్రాచుర్యం పొందాల్సిన అంశం. ఇక గోదావరి, మంజీర, హరిద్ర నదుల త్రివేణి సంగమ ప్రాంతం కావడం గర్వకారణం. కందకుర్తిలో ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేశవ స్మృతి మందిరాన్ని నిర్మిస్తున్నారు.
యువత చరిత్రను చదవాలి. అందులోని మంచి చెడు రెండింటినీ వేర్వేరుగా అర్థం చేసుకోవాలి. చరిత్ర నేర్పిన పాఠాలను, ఆనాటి పరిస్థితులను అధ్యయనం చేయాలి. చరిత్ర అంటే బోరింగ్ సబ్జెక్ట్ అనే భావన నుంచి నేటితరాలు బయటకు రావాలి. చరిత్ర లేకుంటే అస్తిత్వమే ఉండదు.
స్వాతంత్ర సమరయోధుడిగా అనేక అవార్డులు, సత్కారాలు, గవర్నర్ చేతుల మీదుగా విశేష పురస్కారాలు, పురావస్తు పరిశోధన శాఖ నుంచి పలు అవార్డులు అందుకున్నా. చరిత్రను నేటితరం వ్యక్తుల నుంచి రాబోయే తరం యువతకు అందజేయాలి. ఇదే నా జీవితాశయం.
ఇందూరు చరిత్రను ప్రపంచానికి
తెలియజెప్పేందుకు జీవితాంతం కృషి
అంబేడ్కర్ చెప్పిన మాటను
పుణికిపుచ్చుకున్న కందకుర్తి యాదవరావు
బ్రిటిష్ దురాగతాలు, రజాకార్ల
అకృత్యాలను కళ్లతో చూశా..
నిజమైన చరిత్ర నేటి,
భావితరాలకు తెలియాలి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో
కందకుర్తి యాదవరావు


