శుభోదయం పాఠశాలలకు ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

శుభోదయం పాఠశాలలకు ఇక్కట్లు

Mar 21 2026 5:25 AM | Updated on Mar 21 2026 5:25 AM

నిలిచిన నిధులు

మెరుగైన సేవలకు

దివ్యాంగులు దూరం

ధర్పల్లి: ప్రత్యేక అవసరాల పిల్లలకు నిపుణులతో చదువు చెబుతూనే చికిత్సలు చేయించడం, వారిని మానసికంగా దృఢపర్చడంలో శుభోదయం పాఠశాలలది కీలకపాత్ర. ప్రస్తుతం ఈ పాఠశాలలు నిధులు లేక సతమతం అవుతున్నాయి. ఉమ్మడి రాష్ర ప్రభుత్వ హయాంలో 2006లో డీఆర్డీవో అధికారులు జిల్లాలో ఐదు శుభోదయం దివ్యాంగుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. డీఆర్డీవో సెర్చ్‌ (సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ) నిధులతోనే వీటి నిర్వహణ కొనసాగేది. కొవిడ్‌ అనంతరం వీటికి నిధులు కేటాయించడం లేదు. దీంతో దివ్యాంగ పిల్లల కనీస అవసరాలు మెరుగుపర్చడం కష్టంగా మారింది.

ఐదు మండలాలు ఎంపిక..

నిజామాబాద్‌ జిల్లాలో ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ, భీంగల్‌ మండలాల్లో శుభోదయం దివ్యాంగుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 5 నుంచి 60 ఏళ్ల దివ్యాంగుల వరకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెర్చ్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక వాహనంతో మండలంలోని ఆయా గ్రామాలకు వెళ్లి దివ్యాంగ పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చేవారు. ఈ కేంద్రాల్లో అంగవైకల్యం, మానసిక స్థితి సరిగా లేనివారు, దృష్టిలోపం, పక్షవాతం వచ్చిన వారికి శిక్షణ ఇస్తారు. దివ్యాంగులు ఎవరి సాయం లేకుండా వారి పనులు వారు చేసుకునేలా రోజు ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ వంటివి చేయిస్తారు. శారీరక లోపాలను బట్టి తమ పనులు తాము చేసుకునేలా నిపుణులతో సాధన చేయించేవారు. మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. ఇలా ప్రతినెలా ఒక్కో పాఠశాల నిర్వహణకు సుమారు రూ.40 వేల నుంచి 60వేల వరకు నిధులు కేటాయించేవారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి పిల్లల్లో ఎదుగుదలను వివరించే వారు. కానీ కొవిడ్‌ పరిస్థితులతో 2021 నుంచి వీటి నిర్వహణకు సెర్చ్‌ నిధులు కేటాయించడం లేదు. దీంతో వాహన సేవలు నిలిచిపోయాయి. ప్రతి రోజు ధర్పల్లి మండల కేంద్రంలోని పాఠశాలకు 25 నుంచి 30 మంది దివ్యాంగులు వచ్చేవారు. కొవిడ్‌ సమయం నుంచి నిధుల ఆగిపోవడంతో ఈ కేంద్రాలకు ఆయా గ్రామాల నుంచి వచ్చే దివ్యాంగులు రావడం లేదు. ప్రస్తుతం పాఠశాల ఉన్న గ్రామంలోని వారు మాత్రమే కేంద్రాలకు వస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో వారానికి ఒకరోజు పిల్లల ఇంటి వద్దకు వెళ్లి శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు కేంద్రాలకు వచ్చే పిల్లలకు తమ సొంత డబ్బులతోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రయాణ చార్జీలతో పాటు మధ్యాహ్న భోజనానికి నిధులు విడుదల చేస్తే చాలామంది దివ్యాంగులకు మేలు జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement