● కామారెడ్డి జిల్లావాసిగా గుర్తింపు
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన దుంపటి వినయ్‌కుమార్(32)గా గుర్తించారు. మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, మృతుడికి నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. గత నెల కవలల దినోత్సవం రోజున పెళ్లయినట్లు సమాచారం.
కరెంట్ షాక్‌తో రైతుకు గాయాలు
మాచారెడ్డి: విద్యుదాఘాతంతో ఓ రైతుకు గాయాలైన ఘటన మండలంలోని గోగుబండ తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీపురం స్వామిదాస్ అనే రైతు తన పంట పొలంలో తిరుగుతుండగా విద్యుత్తు వైర్లు తగిలి గాయాలయ్యాయి. పక్క చేనులో ఉన్న మరో రైతు స్వామిదాస్‌ను గమనించి కుటుంబ సభ్యులు, 108 సిబ్బందికి సమాచారం అందించాడు. అంబులెన్స్ సిబ్బంది నరేశ్, ప్రణీత్ ప్రథమ చికిత్స నిర్వహించి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా ఒలంపియాడ్ హైస్కూల్‌లో స్లాబ్ పెచ్చులూడి విద్యార్థికి గాయాలయ్యాయి. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామానికి చెందిన హిమదీపక్ అనే విద్యార్థి ఆర్మూర్ ప్రజ్ఞ ఒలంపియాడ్ పాఠశాలలో యూకేజీ విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఆకస్మత్తుగా పాఠశాల భవంతి స్లాబ్ పెచ్చులూడి విద్యార్థిపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. దీంతో ఆర్మూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.


