క్యాంపస్‌ సమాచారం | - | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌ సమాచారం

Mar 10 2026 1:26 PM | Updated on Mar 10 2026 1:26 PM

తెయూలో రెండు రోజుల జాతీయ సదస్సు

25, 26వ తేదీల్లో నిర్వహణ

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్స్‌ ఇన్‌ మెడిసినల్‌ కెమిస్ట్రీ (ఐఎంసీ)–2026’ అనే అంశంపై ఈ నెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్నారు. సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ యాదగిరి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని మెడిసినల్‌ కెమిస్ట్రీ రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు, ఆవిష్కరణలపై చర్చిస్తారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ సాయిలు మాట్లాడుతూ పరిశోధకులు తమ అబ్‌స్ట్రాక్ట్‌లను ఈ నెల 15లోపు సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో కోకన్వీనర్‌ నాగరాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాగరాజు, బాలకిషన్‌, అధ్యాపకులు గంగాకిషన్‌, నాగేంద్రబాబు, సునీత, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్క్రిప్ట్‌ టు స్క్రీన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాపై..

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘స్క్రిప్ట్‌ టు స్క్రీన్‌ : ఎలక్ట్రానిక్‌ మీడియా’ అనే అంశంపై బుధవారం నుంచి మూడు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన వర్క్‌షాప్‌ బ్రోచర్‌ను వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి ఆవిష్కరించారు. వర్క్‌షాప్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఆంజనేయులు, సంపత్‌ కుమార్‌, బీవోఎస్‌ చైర్మన్‌ శాంతాబాయి, పీఆర్‌వో రమణాచారి, అధ్యాపకులు మోహన్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

నూతన కళాశాలకు తరలిన సైన్స్‌ విభాగాలు

పూజలు నిర్వహించిన వీసీ

తెయూ(డిచ్‌పల్లి): గత నెల సీఎం రేవంత్‌ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించిన తెలంగాణ యూనివర్సిటీ నూతన సైన్స్‌ కళాశాలలోకి సోమవారం సైన్స్‌ విభాగాలను తరలించారు. నూతన భవనంలో వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ యాదగిరి పూజ లు నిర్వహించారు. ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, బోట నీ, బయో టెక్నాలజీ, మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగాలు నూతన భవనంలోకి తరలివెళ్లాయి. అనంతరం సైన్స్‌ కళాశాలలోని అన్ని విభాగాలను సందర్శించి విభాగాధిపతులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సంపత్‌కుమార్‌, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్‌ రాంబాబు, సైన్స్‌ విభాగాల అధిపతులు ఎం.సత్యనారాయణ, అలీమ్‌ ఖాన్‌, ప్రసన్నశీల, సంపత్‌కుమార్‌, బి.సాయిలు తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు

తెయూ(డిచ్‌పల్లి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ సాధిస్తే సరిపోదని, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ప్రధానమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టీ.యాదగిరిరావు సూచించారు. వర్సిటీ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సోమవారం వీసీ హాజరై ప్రసంగించారు. విద్యార్థులు తమలోని సంకోచాలను అధిగమించి ఇంట్రావర్ట్‌ స్వభావం నుంచి ఎక్స్‌ట్రావర్ట్‌గా మారేందుకు ప్రయత్నించాలన్నారు. వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్‌ నైపుణ్యా లు, నాయకత్వ లక్షణాలు, టీమ్‌ వర్క్‌ వంటి అంశాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చన్నారు. ఉపాధి అవకాశాలకు అవసరమైన సాఫ్ట్‌ స్కిల్స్‌, సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్‌ నైపుణ్యాలను నేర్చుకోవడం చాలా అవసరమని వివరించారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పాత నాగరాజు, ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఆంజనేయులు, శ్రీనివాస్‌, కిరణ్‌ రాథోడ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి వర్క్‌షాప్‌ను

సద్వినియోగం చేసుకోవాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ జియో ఇన్ఫర్మెటిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్‌షాప్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ యాదగిరిరావు సూచించారు. సోమవారం వర్క్‌షాప్‌ బ్రోచర్స్‌ను రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరితో కలిసి వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24, 25, 26వ తేదీల్లో ‘గ్రామీణ జీఐఎస్‌, మొబైల్‌ జీపీఎస్‌ ద్వారా సామాజిక నిర్ణయాధికారం – ప్రయోగాత్మక అనుభవంతో కూడిన భవిష్యత్‌ ధృక్పథం’ అనే అంశంపై ఈ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అత్యవసరమన్నారు. వర్క్‌షాప్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ప్రతిజ్ఞ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వనరుల నిర్వహణ ప్రణాళికపై నిర్ణయాలు తీసుకోవడంలో మొబైల్‌ జీపీఎస్‌, గ్రామీణ జీఐఎస్‌ ద్వారా సమాచారం సేకరించి అవసరమైన మ్యాప్‌లను తయారు చేయడానికి వర్క్‌షాప్‌ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌ సుధాకర్‌ గౌడ్‌, జియో ఇన్ఫర్మెటిక్స్‌ హెచ్‌వోడీ సబిత, వర్క్‌షాప్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఎస్‌.నారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement