వరద కాలువ మరమ్మతులకు రూ.8.52 కోట్లు
● నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద వరద కాలువలో పడిన గండి మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8.52 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దవాగు పైనుంచి వరద కాలువ నీటిని మళ్లించడానికి గాండ్లపేట్ వద్ద అక్విడెక్ట్‌ను నిర్మించారు. అక్విడెక్ట్ సిమెంట్ కట్టడం తర్వాత మెట్‌పల్లి వైపునకు నీరు వెళ్లేమార్గంలో గండి ఏర్పడింది. గడిచిన అక్టోబర్‌లో వరద కాలువలోకి నీటిని విడుదల చేయడం, పెద్దవాగు వద్ద నిర్మించిన చెక్‌డ్యాం వద్ద నీరు నిలచి ఆ ధాటికి కింది భాగంలో గండి ఏర్పడిన విషయం విదితమే. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువకు నీటి విడుదల నిలిచిపోయింది. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లించే ప్రక్రియకు బ్రేక్ పడింది. గండిని పూడ్చి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడితే నీటి తరలింపునకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇంజినీరింగ్ విభాగం ఉన్నతాధికారులు భావించారు. అందులో భాగంగా గండిపడిన చోటును పరిశీలించి అంచనాలను తయారు చేయాలని ఎస్సారెస్పీ అధికారులకు సూచించారు. వారు పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభమవుతాయని ప్రాజెక్టు ఈఈ చక్రపాణి ‘సాక్షి’కి వెల్లడించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించింది..
వరద కాలువకు ఏర్పడిన గండిని పూడ్చేందుకు ప్ర భుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరం. వర ద కాలువలో నీటి ప్రవాహం ఉంటే ఇరువైపులా ఉన్న వ్యవసాయ భూముల సాగునీటికి ఇబ్బంది ఉండ దు. పనులు పూర్తికాగానే నీటి విడుదల సజావుగా సాగుతుంది.
– రొక్కం మురళి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్
వరద కాలువ మరమ్మతులకు రూ.8.52 కోట్లు


