సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు..
● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
● డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా
జిల్లా కలెక్టర్
● త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలకవర్గాల ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీ సుకుంది. ఈ మేరకు శుక్రవారం జీ.వో.నం.597ను జారీ చేసింది. డీసీసీబీలకు జిల్లా కలెక్టర్‌ను పర్సన్ ఇన్‌చార్జిగా, సొసైటీలకు సహకార సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో 89 సహకార సంఘాలు (సొసైటీ)లు ఉండగా 2.70 లక్షల మంది వరకు రైతులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీలకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న పాలకవర్గాల పదవీ కాలం ముగియాల్సి ఉండగా ప్రభు త్వం రెండు సార్లు పొడిగించింది. ఇప్పుడు పాలకవర్గాలు రద్దు కావడంతో త్వరలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొత్త మండలాలు ఏర్పడిన నేపథ్యంలో అక్కడ సొసైటీల పునర్విభజన చేసి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సొసైటీల పాలకవర్గాల రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయని, జిల్లా కలెక్టర్ ఆ దేశాల మేరకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు ‘సాక్షి’కి వెల్లడించారు.


