పెన్షన్ వ్యాలిడేషన్ సవరణను రద్దు చేయాలి
● ఉద్యోగుల, పెన్షనర్ల జాతీయ
నాయకులు వీ నాగేశ్వరరావు
నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ వ్యాలిడేషన్ సవరణను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగుల, పెన్షనర్ల జాతీయ నాయకుడు వీ నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక న్యూ అంబేడ్కర్ భవన్‌లో పెన్షనర్స్ డే సందర్భంగా నిర్వహించిన పెన్షన్ భద్రత దినోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వానికి సేవలందించిన పెన్షనర్లకు మెడ మీద కత్తిలా వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టం వేలాడుతోందని, దీనిని పెన్షనర్లు సమైక్యంగా తిప్పి కొట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను కాలదన్ని కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఖర్చు పెరుగుతుందని, తగ్గించాలని ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే జనవరి 26 నుంచి పాత పెన్షనర్లకు డీఏ, పే రివిజన్ ఉండదని చట్టం చేసిందని ఇది భవిష్యత్తు తరాలకి నష్టదాయకమన్నారు. అనంతరం మూడు రోజుల పాటు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సీనియర్ సిటిజన్లను సన్మానించారు. కార్యక్రమంలో శిర్ప హనుమాన్లు, గంగారాం, ఈవీఎల్ నారాయణ, రామ్మోహన్‌రావు, లావు వీరయ్య, రాధా కిషన్, సాంబశివరావు, ప్రసాదరావు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.


