వికసిత్ భారత్ శిక్ష అధిక్షణ్ బిల్లు పత్రాలు దహనం
తెయూ(డిచ్‌పల్లి): ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ ఎస్‌ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎదుట వికసిత్ భారత్ శిక్ష అధిక్షణ్ బిల్లు పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు దీపిక మాట్లాడుతూ.. ప్రస్తుతం నూత న జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యను మరింతగా ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం సరికాదన్నారు. యూజీసీ పేరుతో గత ప్రభుత్వాలు విద్యాసంస్థల అభివృద్ధి కోసం గ్రాంట్లను అందించేవి కానీ ఈ బిల్లుతో విద్యారుణాలను అందించే దుస్థితికి తీసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కారం చక్రి, యూనివర్సిటీ నాయకురాలు బాలమణి, కుమారి, సాయి, రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


