ఇసుకాసురుల ఇష్టారాజ్యం
బోధన్‌రూరల్: బోధన్ డివిజన్‌లోని మంజీర నది తీరంలో ఇసుక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించాలని అధికారులు షరతు విధిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఇసుక వాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారు. తాజాగా శుక్రవారం బోధన్ మండలం కల్దుర్కిలో ఇసుక ట్రాక్టర్‌ను అతివేగంగా నడిపి ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలు బలిగొన్నారు. ఈ నెల 16 న సాలూర ఆర్‌ఐ ఆనంద్ మందర్న ఇసుక క్వారీలో వేబిల్లులు ఇస్తుండగా ఓ వ్యక్తి వేబిల్లుల బుక్ లాక్కొని క్వారీ నుంచి వెళ్లిపోవాలని దౌర్జన్యానికి దిగాడు. దీంతో సదరు ఆర్‌ఐ బోధన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.
నియంత్రణలో విఫలం..
బోధన్ డివిజన్‌లోని ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు పనుల కోసం సాలూర, బోధన్ మండల పరిధిలోని మంజీర నదిలో ఇసుక తవ్వకానికి రెవెన్యూ అధికారులు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అయితే, ఇసుక ఎక్కువ ట్రిప్పులు తరలించాలనే ధ్యాసతో వాహనాల డ్రైవర్లు అతివేగంగా నడుపుతున్నారు. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరోవైపు మైనర్లు సైతం ఇసుక ట్రాక్టర్లను నడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
అనుమతిలేని ప్రాంతాలకు తరలింపు..
ఇసుక అనుమతులు తీసుకున్న చోటుకు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది. మరికొంతమంది వ్యాపారులు అనుమతుల పేరిట ఇసుకను ప్రభుత్వ క్వారీల నుంచి తీసుకొచ్చి డంప్ చేసుకుంటున్నారు. మంజీర తీర గ్రామానికి చెందిన ఓ ఇసుక వ్యాపారి పట్టణ శివారులోని ఆచన్‌పల్లి సమీపాన పాండుఫారం రోడ్డులో నిత్యం ఇసుక డంప్ చేసుకొని, రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయమై స్థానిక కాలనీవాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
● ఒకరి మృతి
బోధన్‌రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామ శివారులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కల్దుర్కి గ్రామానికి చెందిన వట్టం రాములు(57) పని నిమిత్తం బైక్‌పై బోధన్‌కు వెళ్తుండగా వెనక నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇసుక ట్రాక్టర్ అతివేగంగా నడపడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై మశ్చేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుడి కొడుకు పవన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మంజీర నది నుంచి ఇసుక తరలించే వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. ఇసుక వాహనాలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మైనర్లు సైతం ఇసుక ట్రాక్టర్లను నడుపుతున్నారు. అధికారులు ప్రత్యేక బృందాలను నియమించి వాహనాల వేగానికి అడ్డుకట్ట వేయాలి.
– సీహెచ్. దమ్మారెడ్డి, కల్దుర్కి, బోధన్ మండలం
రాములు (ఫైల్)
బోధన్ డివిజన్‌లో పెరిగిపోతున్న
ఇసుక వ్యాపారుల ఆగడాలు
అధికారులపై దాడులకు యత్నాలు..
వాహనాల అతివేగంతో ప్రమాదాలు
విఫలమవుతున్న పోలీస్, రెవెన్యూ
యంత్రాంగం
ఇసుకాసురుల ఇష్టారాజ్యం
ఇసుకాసురుల ఇష్టారాజ్యం


