బోనస్.. జాప్యం
● రూ. 90 కోట్ల మేర బకాయి
● సన్నరకం వడ్లు సాగు చేసిన
రైతుల నిరీక్షణ
ఇందల్వాయి : రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వడ్లకు ప్రకటించిన బోనస్ జమ చేయడంలో జాప్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి నెల రోజులు గడుస్తున్నా ఇంకా ఖాతాల్లో బోనస్ డబ్బులు పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, పంట దిగుబడి తగ్గి ఆవేదనలో ఉన్న రైతులకు బోనస్ రూపంలో కాస్త చేయూత లభిస్తుందని ఆశిస్తున్నారు. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 88,181 మంది సన్నరకం ధాన్యం విక్రయించారు. కాగా, ఈ నెల 6వ తేదీ వరకు 52,272 మంది రైతులకు రూ.194 కోట్ల 24 లక్షల 42 వేల 800 బోనస్ అందించారు. మిగితా 35,909 మంది రైతులకు రూ.89 కోట్ల 42 లక్షల 86 వేల 400 చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా యాసంగి సీజన్‌లో అయినా ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం(రైతు భరోసా) అందిస్తుందని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో నాట్లు వేస్తుండగా, మరికొన్ని చోట్ల వరి నాటే దశకు చేరుకుంది.


