బుజ్జగింపుల పర్వం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కాంగ్రెస్, న గర కాంగ్రెస్ పీఠాల కోసం రేసులో చివరి వరకు కొనసాగి భంగపడిన నాయకులను బుజ్జగించే పర్వం నడుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నేరుగా రంగంలోకి దిగారు. సదరు నాయకులను హైదరాబాద్‌కు పిలిపించుకుని ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సదరు నా యకులను అత్యవసరంగా పిలిపించుకుని వన్ టు వన్ మాట్లాడుతుండడం పట్ల ప్రాధాన్యం సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం చివరి వరకు పోటీపడిన బాడ్సి శేఖర్‌గౌడ్, మార చంద్రమోహన్‌రెడ్డిలను శుక్రవారం హైదరాబాద్ పిలిపించుకుని ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడారు. మీనాక్షితో పా టు జిల్లా వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ ఇన్‌చార్జి సచిన్ సావంత్ సైతం ఉన్నారు. పార్టీలో సుమారు 40 ఏళ్లుగా పని చేస్తూ వివిధ పదవు లు, పార్టీ పదవులు నిర్వహించిన వీరిద్దరి విష యమై తగినవిధంగా ప్రాధాన్యత ఇస్తామని మీ నాక్షి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల రేసులో ఉన్న వీరిద్దరూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు సైతం అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శేఖర్‌గౌడ్, చంద్రమోహన్‌రెడ్డికి ఏ పదవులు కేటాయిస్తారోననే చర్చ మొదలైంది. ‘నామినేటెడ్ ఆశలు నెరవేరేదెన్నడో..’ అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. గత జూన్ నెలలోనే మీనాక్షి నగరాజన్ పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులు, కార్యకర్తల గురించి ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై వివరాలు సేకరించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ తాజాగా ‘సాక్షి’ కథనంలో విశదీకరించడంతో ఈ కదలిక మొదలైందని, ఇందులో భాగంగానే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది.
సీసీసీ రేసులో ఉన్నవారిని సైతం..
నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం తుదివరకు రేసులో కొనసాగిన నాయకులను సైతం మీనాక్షి పిలిపించుకుని మాట్లాడారు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడి జిల్లా పార్టీ ఇన్‌చార్జి సచిన్ సావంత్ ద్వారా వివరాలు నోట్ చేయించుకున్నారు. మీనాక్షి పిలిపించి మాట్లాడిన వారిలో పార్టీ నగర పీఠం ఆశించిన నరాల రత్నాకర్, జావెద్ అక్రం, రామర్తి గోపి, గన్‌రాజ్, కౌడపు శరత్ ఉన్నారు.
పార్టీ కోసం పాటుపడిన వీరికి తగిన న్యాయం చేస్తానని మీనాక్షి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు విషయమై ఆందోళన చెందవద్దని తాను చూసుకుంటానని ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఆదివారం మరికొందరిని పిలిపించుకుని విడివిడిగా మాట్లాడేందుకు మీనాక్షి నుంచి జిల్లాకు చెందిన బాస వేణుగోపాల్ యాదవ్ తదితరులకు ఫోన్లు వచ్చాయి. ఈ బుజ్జగింపుల పర్వం మరో రెండురోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా నుంచి పలువురు నాయకులను విడతలవారీగా పిలిపించుకుని బుజ్జగింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉమ్మడి జిల్లా తరువాత వరుసగా అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులను పిలిపించుకుని ఒక్కొక్కరితో విడిగా మాట్లాడే ప్రక్రియ ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
డీసీసీ, సీసీసీ పీఠాలు ఆశించినవారితో మీనాక్షి నటరాజన్ సమావేశం
ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి
భవిష్యత్తులో తగిన అవకాశాలు
కల్పిస్తామని హామీ


