గత ఎన్నికల్లో ప్రత్యర్థులు.. నేడు మిత్రులు..
మోర్తాడ్: రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది మరోసారి నిజమైంది. గత పంచాయతీ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపి ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు బీఆర్‌ఎస్ నాయకులు ఈ ఎన్నికల్లో మిత్రులుగా కలిసిపోయి ఒకరి విజయం కోసం మరొకరు ప్రచారం చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాపాయి పవన్ తల్లి నర్సుపై, భోగ ఆనంద్ భార్య ధరణి మోర్తాడ్ సర్పంచ్‌గా విజయం సాధించింది. ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో కొనసాగినా ప్రత్యర్థులుగానే ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీసీ జనరల్‌కు కేటాయించడంతో పోటీకి ఆనంద్‌తో పాటు పవన్ కూడా సిద్ధమయ్యారు. కానీ బీఆర్‌ఎస్ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆనంద్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు బరిలోకి దిగితే పార్టీకి మంచిది కాదని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సూచించి, ఇద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో పవన్ బరిలో నుంచి తప్పుకున్నారు. అలాగు ఆనంద్ విజయం కోసం పవన్ ప్రచారం చేయాలని పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. ఈ కారణంగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడం, జనాన్ని సమీకరించడానికి ఆనంద్, పవన్‌లు కలిసి తిరగడం మోర్తాడ్‌లో రాజకీయాలలో చర్చకు తావిచ్చింది. ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నాయకులు కలిసి పోవడంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.


