పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు..
● ఇప్పిస్తామంటూ ఓటర్లకు ఎర
● మద్యం, విందులతో
ప్రలోభపెడుతున్న వైనం
● ఓట్ల కోసం పాట్లు పడుతున్న అభ్యర్థులు
ఆర్మూర్: జిల్లాలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించడానికి వారి అవసరాలను ఎరగా వేస్తున్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకాలం తమ అవసరాల కోసం అధికారులు, నాయకుల చుట్టు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోని వారు ఇప్పుడు ఓట్ల కోసం నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చి రెండో పర్యాయం నామినేషన్లు వేసిన అభ్యర్థులు గ్రామంలో తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు గాలెం వేస్తున్నారు. కొత్తగా బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామాల్లో పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలను ఎత్తిచూపుతున్నారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటు ఓట్లు అడుగుతున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు వార్డులలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. మహిళ అభ్యర్థులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు సమస్యల పరిష్కారం తమతోనే సాధ్యమంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం డబ్బు, మద్యం ప్రధాన అంశాలు కానున్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లకు మద్యం తాగిపిస్తూ పార్టీలు ఇవ్వడం గ్రామాల్లోని గల్లీల్లో నిత్యం కనిపిస్తూనే ఉంది. ప్రచారం చివరి రోజులలో డబ్బులు, మద్యం బాటిళ్లు వెదజల్లి ఓట్లు దండుకోవచ్చని అభ్యర్థులు అందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ప్రచారం నిర్వహించే యువకులకు నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు.
పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు..


