సకాలంలో దరఖాస్తులు చేయించాలి
నిజామాబాద్ అర్బన్: ఉపకార వేతనాల కోసం అర్హులైన విద్యార్థులు అందరూ సకాలంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేలా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంఈవోలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులతో స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేయించి, అవి ఆమోదం పొందేలా చూడాలన్నారు. ఈ నెలాఖరు చివరి గడువు కాగా, ఆ లోపే అర్హత కలిగిన ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందేలా చొరవ చూపాలన్నారు. వారం అనంతరం తాను మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.


