జీపీ ఎన్నికల్లో ఆర్వోలదే కీలక పాత్ర
● పోలింగ్, కౌంటింగ్ సజావుగా
నిర్వహించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, అన్నివిధాలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. తొలి విడత బోధన్ డివిజన్‌లో ఈ నెల 11న పోలింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్‌లో నిర్వహించిన ఆర్వో, ఏఆర్వోల శిక్షణా తరగతులకు కలెక్టర్ హాజరై దిశానిర్దేశం చేశారు.
జీపీ ఎన్నికల్లో కీలక పాత్ర వహించే ఆర్వో, ఏఆర్వోలు పోలింగ్ నిర్వహణకు ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. వివాదాలు, తప్పిదాలకు చోటు ఇవ్వకుండా నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు. సమయ పాలన కచ్చితంగా పాటించి అప్రమత్తతతో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులకు ఆస్కారం ఉండదన్నారు. ఎన్నికల సామగ్రి సరి చూసుకోవాలని, బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగరూకతతో వ్యవహరించాలన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా తగిన వార్డు సభ్యుల కోరం ఉందా లేదా అని పరిశీలించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి సందేహాలున్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతోపాటు నోటా గుర్తును తప్పనిసరిగా సరి చూసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈవో అశోక్, డివిజన్, మండలాల అధికారులు పాల్గొన్నారు.


