ఆటలాడించే వారేరి..?
● కాలేజీల్లో పీడీలు, స్కూళ్లలో
పీఈటీలు కరువు
● ఫైనాన్స్‌శాఖ వద్ద జిల్లాలో 107
పీఈటీ పోస్టుల భర్తీ ప్రతిపాదనలు
ఖలీల్‌వాడి: ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఆటలాడించే పీఈటీ, పీడీలు కరువయ్యారు. జిల్లా వ్యా ప్తంగా ఆటలకు సంబంధించిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. జిల్లాలోని 16 ప్రభుత్వ కాలేజీల్లో ఒక్క ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) కూడా లేడు. జిల్లాలో 132 ప్రాథమికోన్నత, 255 జెడ్పీ పాఠశాలల్లో 143 మంది పీఈటీలు పనిచేస్తున్నారు. డీఎస్సీలో 2001లో 92, 2009లో 100 పీఈటీ పోస్టులను భర్తీ చేయగా, తర్వాత వచ్చిన డీఎస్సీలో రెండు నుంచి ఐదు పోస్టుల వరకు మాత్రమే భర్తీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 107 పోస్టుల కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే, ఆ ఫైల్ ఇప్పుడు రాష్ట్ర ఫైనాన్స్ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
క్రీడా కోటాకు దూరం
కాలేజీ విద్యార్థులకు విద్యాశాఖ ప్రత్యేకంగా అండర్–19 క్రీడా పోటీలను నిర్వహిస్తుంది. పోటీల్లో ప్రతిభ చూపే క్రీడాకారులకు ధ్రువపత్రాలు అందజేస్తారు. అయితే మైదానాలు, పీడీలు, లేక ఆటలు ఆడలేక క్రీడాకారులు రిజర్వేషన్లకు దూరమవుతున్నారు.
ఖేలో ఇండియాకు శ్రీకారం...
క్రీడాకారులను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఖేలో ఇండియాకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఇందులో శిక్షణ ఇస్తారు. కాగా, ఆటలో రాణించాలంటే పీఈటీలు, పీడీలు తప్పనిసరి. ప్రాథమికోన్నత స్థాయి నుంచి క్రీడలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో క్రీడాకారులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం హైస్కూల్ స్థాయి నుంచి కాకుండా ప్రాథమికోన్నత పాఠశాలకు పీఈటీలు నియమిస్తే ఖేలో ఇండియాకు ప్రతిభ గల క్రీడాకారులు లభిస్తారు.
నిధులు వృథా..
ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 10 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వి ద్యా సంవత్సరం ప్రారంభంలో కళాశాలలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.60 లక్షలు క్రీడల కోసం మంజూరయ్యాయి. వా టితో పరికరాలను కొనుగోలు చేశారు. అయి తే, పీడీలు లేకపోవడంతో ఆటలకు దూరమవుతున్నారు. అలాగే ప్రాఽథమికోన్నత పాఠశాలలకు రూ.10 వేలు, హైస్కూళ్లకు రూ.25 వేలు, పీఎంశ్రీ కింద ఎంపికై న 40 పాఠశాలలకు రూ.50 వేలు కేటాయించింది. కాగా, పీఈటీలు లేనిచోట టీచర్లే ఆటలు ఆడిస్తూ టోర్నీలకు తీసుకెళ్తుండటం గమనార్హం.
జిల్లాలో పీడీలు లేరు
జిల్లాలో పీడీలు లేరు. దీంతో విద్యార్థులు ఆటలకు దూరంగా ఉన్నారు. పీడీలు లేకపోవడంతోనే అండర్–19 నిర్వహించలేక పోయాం. క్రీడల నిర్వహణకు రాష్ట్ర ఎస్‌జీఎఫ్‌కు లేఖ రాశాం. అనుమతి రాగానే అండర్–19ను ఎస్‌జీఎఫ్ సహకారంతో నిర్వహిస్తాం.
– రవికుమార్, డీఈఐవో, నిజామాబాద్
ప్రాథమిక స్థాయి నుంచి క్రీడలు నేర్పాలి
క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఖేలో ఇండి యా తీసుకువస్తుంది. క్రీడాకారులు రాణించాలంటే ప్రా థమిక స్థాయి నుంచి వివిధ క్రీడలపై తర్ఫీదునివ్వాలి. అందుకు అనుగుణంగా పీఈటీ పోస్టులను ప్రాథమిక స్థాయిలో కూడా నియమించాలి. – విద్యాసాగర్‌రెడ్డి,
పెటా, జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్


