చేప పిల్లలు.. చెరువుకు చేరేనా?
ఉన్నతాధికారులకు నివేదించాం
బాల్కొండ: ఎస్సారెస్పీ వద్ద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలోని చేప పిల్లలు చెరువులకు చేరడం లేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాది చేప పిల్లలను మత్స్య సహకార సంఘాలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రస్తుత ఏడాది 53 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం ఉత్పత్తి చేస్తే 15 లక్షల వరకు మాత్రమే అవి బతికున్నాయి. గతంలో చేప పిల్లల కేంద్రం నుంచి మత్స్స సహకార సంఘాలకు ఉచితంగా పంపిణీ చేసేవారు. చేప పిల్లలు చిన్నగా ఉండడంతో ప్లాస్టిక్ కవర్‌లో కట్టి మత్స్యసహకార సంఘాలకు అందించేవారు. దీంతో తక్కువ ఖర్చులో రవాణా పూర్తయ్యేది. ప్రసుత్తం చేప పిల్లల సైజ్ పెద్దగా ఉండడంతో ప్లాస్టిక్ కవర్‌లో వేయడానికి కుదరదని అధికారులు పేర్కొంటున్నారు. వాటిని డ్రముల్లో ఆక్సిజన్ సహాయంతోనే తరలించాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ప్రభుత్వం కొన్నేళ్లుగా మత్స్యకారులకు చెరువుల్లో చేప పిల్లలను ఉచితంగా వదులుతుంది. కానీ ప్రస్తుతం చేప పిల్లలు ఇంకా చెరువుకు చేరక పోవడంతో పాటు చేప పిల్లల రవాణా భారాన్ని ఎవరు భరించాలంటు మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న జాతీయ చేపపిల్లల కేంద్రంలో పరిధిలో 65 మత్స్యసహకార సంఘాలు ఉన్నాయి. చెరువులకు నేరుగా కాంట్రాక్టర్ నుంచే చేపపిల్లలను సరఫరా చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. చేప పిల్లల కేంద్రం నుంచి చేప పిల్లలను వెంటనే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి చేపపిల్లలను వదిలితే దూర భారం తగ్గి ఖర్చు కూడ తగ్గుతుంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చేప పిల్లల కేంద్రం నుంచి చేప పిల్లలను శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వదలాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
చేపపిల్లల కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి చేసిన చేపపిల్లలను ప్రాజెక్ట్‌లోనే వదిలేందుకు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు నివేదించాం. సహకార సంఘాలకు పంపణీ చేయాలంటే రవాణా ఖర్చు మత్స్యకారులే భరించాల్సి ఉంటుంది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – దామోదర్,
మత్స్య అభివృద్ధి శాఖ అధికారి, పోచంపాడ్
సకాలంలో పంపిణీ కాక
పెరిగిన చేప పిల్లలు
డ్రమ్ముల్లో ఆక్సిజన్ సహాయంతో
తరలించాల్సిన పరిస్థితి
ఆందోళనలో మత్స్యకారులు


