కష్టాలను ఎదుర్కొన్నా నష్టాల పాలే!
సరైన దిగుబడులు ఎక్కడా లేవు
డొంకేశ్వర్(ఆర్మూర్) : కష్టాలను ఎదుర్కొంటూ ఖరీఫ్ పంటలు సాగు చేసిన రైతన్నకు చివరకు నష్టాలే మిగిలే దుస్థితి వచ్చింది. ఈ సీజన్ రైతలకు ఏ మాత్రం కలిసిరాలేదు. సాగు పనులు మొదలు పెట్టిన నాటి నుంచి పంట కోసే దాకా అధిక వర్షాలు అల్లాడించాయి. వారానికో వాయుగుండం, నెలకో తుపాను వచ్చి పంటలను పాడు చేయగా, వాటి తెగుళ్లు తోడయ్యాయి. ఫలితంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దిగుబడులు తగ్గాయని మొత్తుకుంటున్న రైతులను ఇటీవల ‘మోంథా’ తుపాను మరిన్ని కష్టాల పాలు చేసింది. నాలుగు నెలలు కష్టించి పండించిన పంటలు నేలపాలయ్యాయి. వర్షానికి వడ్లు, మక్కలు పూర్తిగా తడిసిపోయాయి. చాలా చోట్ల వరద నీటిలో కొట్టుకుపోయాయి. రంగుమారి విత్తనాలు మొలకెత్తాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు పడరాని కష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ, తాలుతోపాటు రంగుమారిందంటూ కొర్రీలు పెడుతున్నారని రైతులు దు:ఖాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేం కాలమంటూ వాపోతున్నారు. మొత్తం మీద ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన రైతులు కష్టాలను ఎదుర్కొని, నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులను చూస్తున్న రైతులు భవిష్యత్‌లో వ్యవసాయం చేయాలా? వద్దా? అనే ఆలోచనకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎకరం వ్యవసాయ భూమిలో మక్క సాగు చేశాను. ఎకరానికి 28 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 20 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వాతావరణంలో మార్పులు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా నష్టపోయాం. – నాగరాజు, రైతు, డొంకేశ్వర్
నాలుగు ఎకరాల్లో సాగు చేసిన వరిని పది రోజుల క్రితం కోయగా ఆరున్నర ట్రాక్టర్ల దిగుబడి వచ్చింది. ఇటీవల భారీ వర్షం కురవడంతో ఒక ట్రాక్టర్ వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. అసలే దిగుబడి లేక ఇబ్బందులు పడుతుంటే వర్షం కోలుకోలేని దెబ్బతీసింది.
– బుజ్జవ్వ, మహిళారైతు, తొండాకూర్, డొంకేశ్వర్ మండలం
ఈ ఫొటోలో తడిసిన ధాన్యాన్ని చూపుతున్న మహిళా రైతు పేరు సావిత్రి. ఈమెది డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామం. సుమారు నాలుగెకరాల్లో వరి సాగు చేసిన సావిత్రి రెండు వారాల క్రితం పంటను కోసింది. ఎనిమిది ట్రాక్టర్ల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా ఆరు ట్రాక్టర్లు మాత్రమే వచ్చింది. అరకొరగా వచ్చిన ధాన్యాన్ని కల్లంలో ఆరబోయగా ఇటీవల మోంథా తుపాను కారణంగా తడిసిపోయి మొలకలు వచ్చాయి. ఇలాంటి కాలాన్ని తానెప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది సావిత్రి.
రైతన్నకు కలిసిరాని ఖరీఫ్
ఈ ఏడాది అధిక వర్షాలతో
పాడైన పంటలు
సీజన్‌లో వారానికో వాయుగుండం, నెలకో తుపాను..
తోడైన తెగుళ్లు, చీడపీడల దాడి
గణనీయంగా తగ్గిపోయిన
పంటల దిగుబడి
ఖరీఫ్‌లో సాగైన పంటల దిగుబడిని పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా సక్రమంగా రాలేదు. 4,36,695 ఎకరాల్లో వరి సాగైతే ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 20 నుంచి 22 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఎకరానికి దాదాపు ఐదారు క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. 52,093 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరానికి 32 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 25 నుంచి 28 క్వింటాళ్లే వచ్చింది. అదే విధంగా సోయా 33,603 ఎకరాల్లో సాగవగా, సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ, ఎకరానికి ఐదారు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇంతగా దిగుబడులు తగ్గిపోవడానికి అధిక వర్షాలు, తెగుళ్లే కారణమని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి పోను ఎకరానికి ఐదారు వేల ఆదాయం మాత్రమే వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టాలను ఎదుర్కొన్నా నష్టాల పాలే!
కష్టాలను ఎదుర్కొన్నా నష్టాల పాలే!
కష్టాలను ఎదుర్కొన్నా నష్టాల పాలే!


