
సా..గుతున్న లిఫ్ట్ నిర్మాణ పనులు!
పంటలు ఉండటంతోనే..
బాల్కొండ: బాల్కొండ మండలం చిట్టాపూర్, శ్రీరాంపూర్, ఆర్మూర్ మండలం సుర్బీర్యాల్, కోమన్‌పల్లి గ్రామాలకు చెందిన సుమారు 3500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన ఎత్తిపోతల పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ఆధారంగా కోమన్‌పల్లి శివారులో పంపుహౌస్ నిర్మించి, సుర్బీర్యాల్, ఫత్తేపూర్, చిట్టాపూర్ వరకు పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేపట్టాలని 2023 అక్టోబర్‌లో రూ. 149.52 కోట్ల నిధులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. శంకుస్థాపన అనంతరం లిఫ్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా కొద్దిమేర పైపులైన్ తవ్వకాలు, పైపులు వేయడం చేపట్టారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద పంపుహౌస్, జాతీయ రహదారి పక్కన డీసీ (డిస్ట్రిబ్యూటర్ చాంబర్) పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పైపులైన్‌ను పంట భూముల నుంచి వేస్తున్నారు. అయితే, వేసవిలో మాత్రమే పైపులైన్ కోసం తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం యాసంగి పంటలను వేసేందుకు రైతులు నేలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పైపులైన్ వేసే అవకాశం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న సిమెంట్ పనులు వేగంగా చేపడితే పంటలు చేతికొచ్చిన తర్వాత వెంటనే పైపులైన్ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ పనులు సైతం నత్తకు నడక నేర్పేలా సాగుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చిట్టాపూర్ ఎత్తిపోతల పథకం పైపులైన్ వేసేందుకు పంటలు అడ్డుగా ఉన్నాయి. పంటలు లేనిచోట పైపులైన్ పనులు చేపట్టాం. ఇప్పటి వరకు 1500 మీటర్ల వరకు పైపులైన్ వేశాం. ప్రస్తుతం డీసీ పనులు సాగుతున్నాయి. పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటాం.
– సురేశ్, డిప్యూటీ ఈఈ,
మైనర్ ఇరిగేషన్, బాల్కొండ
ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్
ఆధారంగా నిర్మాణం
రూ.149.52 కోట్ల నిధులు మంజూరు
రెండేళ్లు గడిచినా
కొనసాగుతున్న పనులు