
చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం
అవగాహన కల్పిస్తున్నాం..
● ధాన్యం నూర్పిళ్లు, ఆరబోతలతో రోడ్డు ప్రమాదాలు
● గత అక్టోబర్‌లో జరిగిన ప్రమాదాల్లో 27 మంది మృతి
● అందులో ధాన్యం ఆరబోతలతో జరిగినవే ఎక్కువ
● పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కనిపించని మార్పు
కామారెడ్డి క్రైం: ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రోడ్లపై ధాన్యం ఆరబోతలు, నూర్పిళ్ల విషయం కూడా అలాంటిదే. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సంబంధించిన విషయం కావడంతో అందరూ సర్దుకుపోతుంటారు. కాకపోతే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసుశాఖ గుర్తు చేస్తోంది. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ విలువైన ప్రాణా లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా మార్పు కనిపించడం లేదు. తాజాగా తాడ్వాయి మండలం చందాపూర్‌లో ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ రోడ్డుపై ఆరబోసిన మక్కల కారణంగా అదుపుతప్పి కిందపడి మృత్యువాత పడ్డాడు.
పోలీసుల ప్రత్యేక దృష్టి..
కామారెడ్డి జిల్లాలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నాటికి వరి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు దినుసుల కోతలు పూర్తవుతాయి. చాలామంది వాటిని రహదారుల వెంట ఆరబోయడం, నూర్పిళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంతకాలం క్రితం టేక్రియాల్ వద్ద ఓ రైతు వడ్లను రోడ్డు వెంట ఆరబోసి రాత్రిపూట రోడ్డు దాటే క్రమంలో వాహనం ఢీకొని మృతి చెందాడు. వాహనాలు అదుపుతప్పి పడిపోవడంతో సంభవించిన మరణాలు అనేకం. గత అక్టోబర్ నెలలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 27 మంది మృతి మృతి చెందగా, అందులో ధాన్యం ఆరబోతల కారణంగా దాదాపు 10 ప్రమాదాలు జరిగినట్లు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అందరి బాధ్యత..
రోడ్లపై ధాన్యం నూర్పిళ్లు, ఆరబోసే విషయంలో వాహనదారులే కాకుండా రైతులు సైతం ప్రమాదాల బారినపడిన ఘటనలు ఉన్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాల్లో కుటుంబ పెద్ద దిక్కయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంటుంది. అందుకే ధాన్యాన్ని రోడ్లపై కాకుండా గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో మాత్రమే ఆరబోయాలని రైతులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రాణం తీసిన మక్కలు
కుప్పను తప్పించబోయి బైక్
అదుపుతప్పి ఒకరు మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన పైడి చిన్నగంగారెడ్డి(52) బైక్‌పై తాడ్వాయిలోని చిన్న కూతురు వద్దకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో రోడ్డపై ఉన్న మక్కల కుప్పను తప్పించబోయి అదుపుతప్పి బైక్‌పై నుంచి కిందపడడంతో గంగారెడ్డి తల, ముక్కుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గంగారెడ్డి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగారెడ్డి మరణించాడు. మృతుడికి భార్య మల్లవ్వ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్లపై ధాన్యం నూర్పిళ్లు, ఆర బోయడంతో ఏటా పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. జీపీలు, రైతు సమితులు కేటాయించిన స్థలాల్లోనే పంట దిగుబడులను ఆరబోయాలి. విలువైన ప్రాణాలు రక్షించుకోవాలి. – రాజేశ్‌చంద్ర, ఎస్పీ, కామారెడ్డి

చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం

చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం