
గురుకులాలపై ‘ప్రత్యేక’ గురి
నివేదిక తీసుకున్నారు..
ఖలీల్‌వాడి:సాంఘిక సంక్షేమ గురుకులాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల, సిబ్బందితోపాటు వసతిగృహాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు 10 మంది ప్రత్యేకాధికారులను గురుకులాల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య నియమించారు. ఉమ్మడి నిజామాబాద్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రమోద్‌ను కేటాయించారు. దీంతో 10 రోజుల క్రితం జిల్లాకు వచ్చిన ఆయన ఉమ్మడి జిల్లా పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. కాలేజీల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రక్షణ చర్యలతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించడం, అద్దె బిల్లుల చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు.
జిల్లాలో 11 సంక్షేమ గురుకులాలు..
జిల్లాలో 11 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలు ఉన్నాయి. అందులో 3 బాలుర, 6 బాలికల, రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాలల్లో 5,761 మంది, డిగ్రీ కాలేజీల్లో 864 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 267 మంది రెగ్యులర్ సిబ్బంది, 84 మంది పార్ట్ టైం, 59 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు.
ఉత్తీర్ణత శాతం పెంపునకు..
సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ప్రత్యేక తరగతుల నిర్వహణపై దృష్టిసారించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించే దిశగా చర్యలు చేపట్టారు. మరోవైపు సిబ్బంది బకాయి వేతనాలను ఇటీవల మంజూరు చేయగా, అద్దె భవనాలకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు వివరాలు సేకరించారు.
ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా
సోషల్ వెల్ఫేర్ డీడీ ప్రమోద్
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ఇప్పటికే ప్రిన్సిపాళ్లతో సమావేశం
చదువుతోపాటు మెనూ అమలుకు కసరత్తు
పదిరోజుల క్రితం ప్రిన్సిపాళ్లతో ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి రివ్యూ చేశారు. గురుకులాలకు సంబంధించిన పలు అంశాలపై నివేదిక తీసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. సిబ్బందికి వేతనాలు మంజూరు చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు త్వరలో విడుదల చేస్తామన్నారు.
– పూర్ణచంద్రరావు, సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారి