
రెండేళ్లకు చిక్కాడు..
తాండూరు: హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని రెండేళ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. వివరాలను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ నగేశ్ శనివారం విలేకరులకు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మన్‌సన్‌పల్లికి చెందిన ముడావత్ రవి(39) వ్యవసాయ పనులు చేస్తూ జీవించేవాడు. గ్రామ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పనిచేసే కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన బాలయ్య అలియాస్ బాలాజీతో ఇతనికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలో పలుమార్లు మద్యం తాగేందుకు రవి వద్ద బాలాజీ రూ.2,050 అప్పుగా తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో పలుమార్లు అడగగా, రవి తన పరువు తీస్తున్నాడని కక్షపెంచుకున్న బాలాజీ 2023 ఆగస్టు 12న మద్యం తాగుదామంటూ తాను పనిచేసే ఫామ్‌హౌస్ వద్దకు పిలిచాడు. అనంతరం పథకం ప్రకారం కత్తితో పొడిచి పారిపోయాడు. ఆస్పత్రి పాలైన బాధితుడు చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత మరణించాడు. దీంతో నిందితుడైన బాలాజీపై హత్య, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. నాటి నుంచి హంతకుడి కోసం పోలీసులు వెతుకుతున్నా ఆచూకీ లభించలేదు. ఇటీవల మృతి చెందిన తన తల్లి అంత్యక్రియలకు సైతం రాలేదు. కొన్నాళ్లుగా అతని కుటుంబసభ్యుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, కాల్‌డాటా ఆధారంగా నిందితుడు సిద్దిపేటలోని తన సోదరుడు సంజీవ్ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. హత్య అనంతరం చాలారోజులు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వీసాపూర్‌లో తలదాచుకున్నాడని విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. కేసులో కీలకంగా పనిచేసిన పోలీసులు అంజాద్, శివకుమార్, మున్నయ్యను అభినందిస్తూ డీఎస్పీ రివార్డులు అందజేశారు.
హంతకుడు మద్నూర్‌వాసి
సిద్దిపేటలో అదుపులోకి
తీసుకున్న పోలీసులు
రిమాండ్‌కు తరలింపు