
తమ్ముడి ఇంట్లో అన్న చోరీ
● వ్యాపారంలో నష్టాలొచ్చాయని..
● కేసును ఛేదించిన పోలీసులు
నిజామాబాద్ అర్బన్: వ్యాపారంలో నష్టాలు, అప్పులు పెరగడంతో తమ్ముడి ఇంట్లో అన్న చోరీకి పాల్పడ్డాడు. నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పది రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నగర సీఐ శ్రీనివాస్‌రాజ్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న మహ్మదీయకాలనీకి చెందిన మహ్మద్ సాబీక్ పాషా ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు తిరిగిరాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. నగదుతోపాటు బంగారం చోరికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రెండో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇంటి పక్కనే ఉన్న అతని అన్న మహ్మద్ షఫీ పాషాను అనుమానించి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడం, అప్పులు పెరగడంతో తమ్ముడి ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. షఫీ పాషాను అరెస్టు చేసి బంగారం, డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసు విచారణలో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాయిద్‌తోపాటు సిబ్బందిని అభినందించారు.