
ఒకే కుటుంబంలోని ముగ్గురి ఆత్మహత్యాయత్నం
● మృతిచెందిన తండ్రి,
చికిత్స పొందుతున్న తల్లి, కొడుకు
● పెళ్లి విషయమై గొడవలే కారణం
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇందులో తండ్రి మృతి చెందగా, తల్లి, కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా.. శివాజీనగర్ కు చెందిన దాసరి కిషన్(68)కు భార్య నాగమణి, ఇద్దరు కొడుకులు వంశీ, బాలకృష్ణ ఉన్నారు. పెద్దకొడుకు వంశీ గల్ఫ్‌కు వెళ్లి తిరిగి వచ్చి, మద్యానికి బానిసయ్యాడు. చిన్న కొడుకు బాలకృష్ణతో కలిసి కిషన్ కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. బాలకృష్ణకు వివాహం జరుగగా, వంశీకి పెళ్లి కాలేదు. ఈవిషయమై మంగళవారం అతడు తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో వంశీ గడ్డిమందు తాగి చనిపోతానంటూ మందు తాగాడు. వెంటనే వంశీ నుంచి తల్లి గడ్డిమందు డబ్బా తీసుకొని ఆమె తాగింది. ఆమె నుంచి కిషన్ డబ్బా తీసుకొని తాగాడు. దీంతో ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి వారిని వెంటనే చికిత్స కోసం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున కిషన్ చికిత్స పొందుతు మృతిచెందగా, మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై మృతుడి చిన్నకుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్థలానికి వెళ్లి వారు విచారణ చేపట్టారు. కిషన్ మృతిచెందిన విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఇవ్వకపోవడం, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంపై పోలీసులు ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు.