
అభిప్రాయాల సేకరణ తర్వాతే డీసీసీ నియామకం
నందిపేట్(ఆర్మూర్): క్షేత్రస్థాయిలో కచ్చితమైన అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే డీసీసీల నియామకాలు చేపడతామని కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ అన్నారు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా రిజ్వాన్ అర్షద్‌ను నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం రిజ్వాన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు ప్రక్రియలో భాగంగానే డీసీసీ పదవి నియామకంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు. అభిప్రాయల నివేదికను పార్టీ అధిష్టానానికి పంపిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నిర్మాణానికి మరింత బలోపేతం చేసేందుకు డీసీసీల పదవుల నియామకానికి ఏఐసీసీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్, మంద మహిపాల్, భూమేశ్వర్‌రెడ్డి, రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.