
మరోసారి రెండుగా చీలిన తొర్తి
ఇరువర్గాలు సహకరించాలి
● గతంలో నమోదైన కేసులలో రాజీ
కుదరకపోవడంతో విడిపోయిన గ్రామస్తులు
● ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా
పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తొర్తి గ్రామస్తులు మంగళవారం మరోసారి రెండు వర్గాలుగా విడిపోయారు. గతంలో నమోదైన కేసులలో రాజీ కుదురకపోవడంతో ఒక వర్గానికి చెందిన దాదాపు వంద కుటుంబాలు ఒకవైపు, మెజార్టీ కులాలకు చెందిన 320 కుటుంబాలు మరోవైపు ఉండిపోయారు. దీంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయనే సందేహంతో పోలీసులు మంగళవారం నుంచి పికెటింగ్ నిర్వహిస్తున్నారు.
2021లో వరి కోతల విషయంలో రెండుగా చీలిపోయిన తొర్తిలో కొంత కాలం వర్గపోరు కొనసాగింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంప్రదింపులు జరిపి గ్రామస్తులను ఐక్యం చేశారు. ఈక్రమంలో వంద కుటుంబాలు ఉన్న వర్గం వారిపై గతంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ కేసు కోర్టులో విచారణకు రాగా సాక్షులుగా ఉన్నవారు కోర్టుకు హాజరయ్యారు. గ్రామంలో అందరం కలిసిపోయినా కేసుల విషయంలో రాజీ కుదురకపోవడంతో వంద కుటుంబాల వారు మళ్లీ కట్టడి చేసుకున్నారు. గతంలో మాదిరిగానే విడిపోయి ఉండాలని తీర్మానించుకున్నారు. రెండో వర్గం వారు దీనిని విభేదించడంతో గ్రామంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. గ్రామస్థులు కలిసిపోయిన సమయంలోనే కేసుల విషయంలో రాజీ కుదిరి ఉంటే ఇప్పుడు వివాదం ఏర్పడేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
క్రైం కార్నర్
తొర్తిలో ఏర్పడిన వివాదం వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండటానికి పోలీసు పికెటింగ్ నిర్వహిస్తున్నాం. ఇరు వర్గాలు పోలీసులకు సహకరించాలి. ఎవరైన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
–పడాల రాజేశ్వర్, ఎస్సై, ఏర్గట్ల

మరోసారి రెండుగా చీలిన తొర్తి