
భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చుదిద్దుకోవాలి
బోధన్: సంఘసంస్కర్తలు మహాత్మ జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి దంపతులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్‌భాస్కర్‌రావు సూచించారు. పట్టణంలోని ఆచన్‌పల్లి ప్రాంతంలోగల మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, బెల్లాల్ ప్రాంతంలోని ఎస్సీ బాలుర గురుకుల కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో చదువు ప్రాముఖ్యతను వివరించి, లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలిపారు. చదువుకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఉపాధ్యాయులతో అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం బెల్లాల్ ప్రాంతంలోని ఎస్సీ బాలుర గురుకుల కళాశాలను సందర్శించారు. ఇరుకుగా ఉన్న తరగతి గదిలోనే నిద్రిస్తున్నామని విద్యార్థులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడిపరిస్థితుల సమగ్ర నివేదికను ఉన్నత న్యాయస్థానానికి నివేదిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది శ్రావణ్, మృణాళిని, పారాలీగల్ వలంటీర్స్ పద్మాసింగ్, రమణారెడ్డి, న్యాయవాది ఆశా నారాయణ తదతరులు ఉన్నారు.

భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చుదిద్దుకోవాలి