
స్తంభాన్ని ఢీకొన్న బైక్: ఒకరి మృతి
ఎల్లారెడ్డి: మండలంలో బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై మహేశ్ వివరాలు ఇలా.. వెల్లుట్ల గ్రామానికి చెందిన పండుగ లక్ష్మణ్(36) బుధవారం మోటార్ సైకిల్‌పై బాన్సువాడ నుంచి గ్రామానికి బయలుదేరాడు. ఆజామాబాద్ గ్రామ శివారులోని మూల మలుపు వద్ద బైక్ అదుపుదప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
రైలు ప్రమాదంలో ఒకరు..
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రైల్వేస్టేషన్–జాన్కంపేట స్టేషన్‌ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని దుబ్బకు చెందిన ట్రాన్స్‌జెండర్ మీరా అలియాస్ నారాయన్ కామాజీ అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ రైల్వేస్టేషన్–జాన్కంపేట స్టేషన్‌ల మధ్య పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురువెళ్లారు. ఈక్రమంలో రైలు ఢీకొని తీవ్రగాయాలై మృతిచెందారు.ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎల్లారెడ్డి: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో ము నిగి మృతిచెందిన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమయ్యింది. వివరాలు ఇలా.. బాలాజీనగర్ తండాకు చెందిన రుడావత్ గణేశ్ (48) మంగళవారం చేపలు పట్టడానికి ఎల్లారెడ్డి పెద్దచెరువులో దిగగా ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహం కోసం గాలించగా బుధవారం మధ్యాహ్నం లభ్యమయ్యింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.