
దేవునిపల్లిలో భారీ చోరీ
● రూ.2.5 లక్షల నగదు, 3.5 తులాల
బంగారం, 50 తులాల వెండి అపహరణ
కామారెడ్డి క్రైం: తాళం వేసి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేలోపే దుండగులు ఇళ్లు గుల్ల చేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దేవునిపల్లిలోని భూమొళ్ల శ్రీశైలం బీడీ కంపెనీ వర్కర్‌గా పని చేస్తున్నాడు. గాంధీనగర్ కాలనీలో బంధువుల పెళ్లి ఉండటంతో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కుటుంబంతో కలిసి వెళ్లారు. శ్రీశైలం తిరిగి శుక్రవారం వేకువజామున 5 గంటలకే వచ్చాడు. అప్పటికే తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో సామాన్లు, బీరువా చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇంట్లో దాచిన రూ.2.5 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితుడు శ్రీశైలం వాపోయాడు. కాగా, పక్కనే ఉన్న మరో ఇంట్లో సైతం దొంగలు చొరబడి చోరీకి యత్నించారు. ఆ ఇంట్లో విలువైన వస్తువులు లేకపోవడంతో వెళ్లిపోయారు.
నవీపేట: మండలంలోని యంచ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై తిరుపతి శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన బేగరి జ్యోతి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నైట్ డ్యూటీ చేసి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చింది. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడటంతో బీరువా తెరిచి ఉంది. అందులోని ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 48 వేల నగదును దుండగులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

దేవునిపల్లిలో భారీ చోరీ