
నకిలీ అధ్యాపకులు!
ఉన్నతాధికారుల దృష్టికి..
నిజామాబాద్‌అర్బన్: ఉద్యోగం క్రమబద్ధీకరణ (రెగ్యులరైజ్) కోసం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారు. ఈ వ్యవహారం పై ప్రస్తుతం జరుగుతున్న విచారణ తుది దశకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అధ్యాపకులను క్రమబద్ధీకరించారు.అయితే కొందరు కాంట్రాక్టు అధ్యాపకులు నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి క్రమబద్ధీకరణ పొందారు. దీనిపై ఫిర్యాదు వెళ్లగా కొన్నేళ్లుగా రాష్ట్రస్థాయిలోనే విచారణ చేపట్టారు. ఇటీవల జిల్లాల వారీగా విచారణ చేపట్టడంతో జిల్లాలో 30 మంది జూనియర్ అధ్యాపకులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు విచారణలో తేలింది.
యూనివర్సిటీలు లేకున్నా..
జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 130 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల కోడ్ సమీపిస్తుందన్న సమయంలోనే ఈ కార్యక్రమం నిర్వహించారు. కాంట్రాక్టు అధ్యాపకులు కొందరు అర్హులు కాకున్నా నకిలీ ధ్రువపత్రాలను తీసుకువచ్చి ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించుకున్నారు. గత నెల 10న జిల్లా ఇంటర్ విద్యాధికారి క్రమబద్ధీకరించబడిన 130 మంది కాంట్రాక్టు అధ్యాపకుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకొని వరంగల్ ఆర్జేడి కార్యాలయంలో పరిశీలన చేశారు. ఇందులో 30 మంది అధ్యాపకులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు గుర్తించారు. ఇందులో పాండిచ్చేరి అలగప్ప, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన దూరవిద్య కేంద్రాలకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించారు. ఈ ధ్రువ పత్రాలకు సంబంధించి ఎలాంటి యూనివర్సిటీ కొనసాగడం లేదు. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన అధ్యాపకుల సంబంధించిన రహస్య విచారణ ప్రస్తుతం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా నకిలీ అధ్యాపకులను గుర్తించి తుది నివేదికను రూపొందించనున్నారు. అనంతరం వీరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
అందరూ పంచుకున్నారు..
కాంట్రాక్టు అధ్యాపకులు క్రమబద్ధీకరణ కోసం భారీగా డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు ప్రజాప్రతినిధులను కలిసి డబ్బులు సమర్పించినట్లు సమాచారం. ఒక్కో అధ్యాపకుడు రూ. ఐదు లక్షల చొప్పున సమర్పించినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అధ్యాపకుల సంఘానికి చెందిన ఇద్దరు నాయకులు కళాశాలల వారీగా కాంట్రాక్టు అధ్యాపకులందరి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర సంఘం నాయకులు, జిల్లా సంఘం నాయకులు, జిల్లాకు చెందిన అధికారులు వసూలు చేసిన డబ్బులు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గత నెల వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో క్రమబద్ధీకరించబడిన కాంట్రాక్టు అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. ఇందులో కొన్ని లోపాలు ఉన్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు పరిశీలన చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పత్రాలను గుర్తించారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు.
– రవికుమార్, ఇంటర్ విద్యాధికారి
క్రమబద్ధీకరణ కోసం
తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ
జిల్లాలో 30 మంది గుర్తింపు
ఒక్కొక్కరి వద్ద
రూ. ఐదు లక్షలు వసూలు
తుది దశకు వచ్చిన
అధికారుల విచారణ
చర్యలకు అవకాశం