
విద్యార్థులను సమయానికి చేర్చండి
● ఆర్టీసీ అధికారులకు
సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు
రెంజల్(బోధన్): విద్యార్థులను సమయానికి బడికి చేర్చాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఆర్‌టీసీ అధికారులకు సూచించారు. శుక్రవారం నిజామాబాద్ డిపో రీజనల్ మేనేజర్ జ్యోత్స, డిప్యూటీ ఆర్‌ఎం మధుసుదన్‌లను జిల్లా కోర్టులోని తన కార్యాలయం న్యాయ సేవాసదన్‌కు పిలిపించుకుని మాట్లాడారు. బస్సులు సమయానికి రాకపోవడంతో రెంజల్ మండలం కందకుర్తిలో విద్యార్థినులు బస్సు ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ‘బస్సును అడ్డుకున్న పాఠశాల విద్యార్థులు’ అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన ఆర్‌టీసీ అధికారులతో చర్చించారు. విద్యార్థులకు ఎలాంటి అవరోధాలు రానీయవద్దని, విద్యను అభ్యసించే వారికి ఇబ్బందులు కలుగకుండా పాఠశాలకు సమయానికి చేరుకునేలా బస్సులను నడపాలని వారికి సూచించారు. పాఠశాల సమయాలను తెలుసుకుని బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు సమయానికి బడులకు వెళ్లకుంటే చదువుపై ప్రభావం పడుతుందని జడ్జి పేర్కొన్నారు. బస్సులను పాఠశాలల సమయానికి అనుగుణంగా నడుపుతామని ఆర్టీసీ అధికారులు అంగీకరించారు.

విద్యార్థులను సమయానికి చేర్చండి

విద్యార్థులను సమయానికి చేర్చండి